AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సబ్ కమిటీ ఆమోదం.. 5 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలో ఉపాధిని కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సూచించారు. ఆదాయం, ఉద్యోగావకాశాలు అందించే పరిశ్రమలు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ సమావేశంలో హుండయ్ పరిశ్రమకు ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆయన అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు.

Telangana: రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సబ్ కమిటీ ఆమోదం.. 5 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్!
Sub Committee
Prabhakar M
| Edited By: |

Updated on: May 26, 2025 | 9:14 AM

Share

తెలంగాణలో ఉపాధిని కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించడమే లక్ష్యంగా.. ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రతీవారమూ ప్రత్యేక కసరత్తు చేయాలని భావిస్తోంది.  ఈ మేరకు ప్రతి శనివారం ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. పరిశ్రమల ద్వారా వచ్చిన పెట్టుబడులు రాష్ట్ర యువతకు ఉపాధిని, ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.ఈ సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇప్పటికే చేసుకున్న ఎంవోయూల అమలు, కొత్త పరిశ్రమల స్థాపనపై విస్తృతంగా చర్చ జరిగింది.

అనుబంధ పరిశ్రమలపై దృష్టి అవసరం..

ఈ సమావేశం సందర్భంగా తెలంగాణలో ఉపాధిని కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించడంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒక ప్రధాన పరిశ్రమ స్థాపనతో అనుబంధంగా మరిన్ని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వస్తాయని… వాటిపై దృష్టిపెట్టి వేగంగా ఆచరణలోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ఇవి రాష్ట్రానికి ఉపాధి, ఆదాయంతో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యతను కలిగిస్తాయని ఆయన వివరించారు. ఆదాయం, ఉద్యోగావకాశాలు అందించే పరిశ్రమలు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

హుండయ్ పరిశ్రమకు సబ్ కమిటీ ఆమోదం..

ఈ సమావేశంలో జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతంలో హుండయ్ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపనకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ కేంద్రం 675 ఎకరాల్లో, రూ.8528 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటుకానుంది. దీనివల్ల 4276 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు హుండయ్ ప్రతినిధులు కమిటీకి వివరించారు.

అధునాతన సదుపాయాలతో రీసెర్చ్ సెంటర్..

జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతంలో ఈ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. హుండయ్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్, పైలట్ లైన్, ప్రోటోటైపింగ్ వంటి ఆధునిక వ్యవస్థలు ఏర్పాటు కానున్నాయి. ఈ కేంద్రం ద్వారా రాష్ట్రానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్‌తో పాటు సాంకేతిక నైపుణ్యాలు కలుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..