AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charlapalli Railway Station: కళ్లముందే కన్న తల్లి మృతి.. బోరున విలపించిన పిల్లలు, చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కన్నీళ్లు పెట్టించే ఘటన!

హైదరాబాద్‌లోని చెర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఆదివారం విషాదకర సంఘటన వెలుగు చూసింది. బోగి మారేందుకు ట్రైన్‌ దిగి మరో బోగిలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాం మధ్యలో పడి ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుగుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేమాన్ని హాస్పిటల్‌కు తరలించారు. కాగా మృతరాలు లింగంపల్లి హెచ్‌ఎంటీ టౌన్‌షిప్‌లో నివాసం ఉంన్న ఏపీవాసి శ్వేతగా గుర్తించారు.

Charlapalli Railway Station: కళ్లముందే కన్న తల్లి మృతి.. బోరున విలపించిన పిల్లలు, చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కన్నీళ్లు పెట్టించే ఘటన!
Anand T
|

Updated on: May 26, 2025 | 7:54 AM

Share

బోగి మారేందుకు ట్రైన్‌ దిగి మరో బోగిలోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాం మధ్యలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో వెలుగు చూసింది. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా దొండపూడికి చెందిన మట్టల వెంకటేష్, శ్వేత దంపతులు హైదరాబాద్‌లోని లింగంపల్లిలో ఉన్న హెచ్‌ఎంటీ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. భర్త ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండగా భార్య శ్వేత(33) హౌస్‌ వైఫ్‌గా ఉండి పిల్లలను చూసుకుంటుంది. అయితే పిల్లలకు సెలవులు ఉండడంతో ఇంటికి వెళ్లొస్తానని భార్య భర్తకు చెప్పగా.. అందుకు అంగీకరించిన భర్త వెంకటేష్ ఆదివారం భార్యతో పాటు పిల్లలను లింగంపల్లి స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో ఎక్కించారు.

అయితే వీళ్లు ఎక్కాల్సి బోగి డి-8 కాగా పొరపాటున డి-3 భోగీలో ఎక్కారు. ఇక లింగంపల్లి స్టేషన్‌ నుంచి బయల్దేరిన ట్రైన్‌ చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక.. వేరే ప్రయాణికులు వచ్చి ఆ సీట్లు తమవని చెప్పడంతో.. తాము వేరే బోగిలో ఎక్కామని అప్పుడు ఆమె గ్రహించింది. దీంతో పిల్లలతో సహా బోగి దిగి డీ-8 వద్దకు చేరుకుంది. ఇక తమ ఇద్దరి పిల్లలను బోగీలోకి ఎక్కించింది. తాను కూడా ట్రైన్‌ ఎక్కుదామనుకునేలోపే రైలు కదిలింది. ఈ క్రమంలో త్వరగా ట్రైక్‌ ఎక్కే ప్రయత్నంతో శ్వేత ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన శ్వేత అక్కడికక్కడే మృతి చెందింది. కల్లముందే తల్లి చనిపోవడంతో ఆ ఇద్దరు పిల్లలు గుండె పగిలేలా ఏడ్చారు. సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భర్త వెంకటేష్ భార్య మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..