Sankranti 2025 Special Trains: సంక్రాంతికి సొంతూరు వెళ్తున్నారా? సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరే స్పెషన్‌ ట్రైన్లు ఇవే

|

Jan 02, 2025 | 11:45 AM

సంక్రాంతి పండక్కి సొంతూరికి వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రైల్వే శాఖ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అవి బయల్దేరే సమయం, తేదీ వంటి పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్పెషల్ టైన్లకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ రిజర్వేషన్ సౌలభ్యం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది..

Sankranti 2025 Special Trains: సంక్రాంతికి సొంతూరు వెళ్తున్నారా? సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరే స్పెషన్‌ ట్రైన్లు ఇవే
Sankranti 2025 Special Trains
Follow us on

హైదరాబాద్‌, జనవరి 2: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకం. బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా ఈ పండక్కి సొంతూళ్లకు వెళ్తుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల నుంచి ఎందరో వలస కూలీలు హైదరాబాద్‌ మహానగరానికి యేటా లక్షలాదిగా వస్తుంటారు. వీరంతా సంక్రాంతికి తప్పనిసరిగా తమ సొంత ఊర్లకు వెళ్లడం ప్రతీయేటా జరిగేదే. దీంతో రైల్వే స్టేషన్లు, బస్సులు జనాలతో కిటకిటలాడిపోతుంటాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ సంక్రాంతికి ప్రత్యేక ట్రైన్లను వేసింది. పండగ రద్దీ దృష్ట్యా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్లాలనుకొనే ప్రయాణికులకు 6 ప్రత్యేక రైళ్లను వేసింది.

కాచిగూడ -కాకినాడ టౌన్‌, హైదరాబాద్‌- కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు టికెట్‌ రిజర్వేషన్ల బుకింగ్‌ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ట్రైన్లు హైదరాబాద్‌ (నాంపల్లి), కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి.

కాచిగూడ – కాకినాడ టౌన్‌ రైలు (07653) జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అలాగే, కాకినాడ టౌన్‌ -కాచిగూడ రైలు (07654) జనవరి 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది. హైదరాబాద్‌ – కాకినాడ టౌన్‌ రైలు (07023) జనవరి 10వ తేదీన సాయంత్రం 6.30గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు పయనంలో ఈ రైలు (07024) జనవరి 11వ తేదీన రాత్రి 8గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఈ మేరకు ప్రయాణికులు ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని, తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.