Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉచిత ప్రయాణం.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్..
ఎంఎంటీఎస్ రైళ్లల్లో జూన్ 2వ తేదీ నుంచి ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుందనే ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉందని, ఇంకా తుది నిర్ణయం జరగలేదని తెలిపింది. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ పంపినట్లు స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లో నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లల్లో ప్రయాణికులకు తెలంగాణ సర్కార్ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. పురుషులు, మహిళలందరికీ ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకురానుందని ప్రచారం నడుస్తోంది. దీని గురించి రేవంత్ సర్కార్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెలంగాణ అవతరణ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీ నుంచి ఈ సౌకర్యం కల్పించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ వార్తలపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.
దక్షిణ మధ్య రైల్వేతో సంప్రదింపులు
ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వేతో సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవమేనని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు పంపించిందని స్పష్టం చేసింది. లేఖ ద్వారా రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపిందని, ఉచిత ప్రయాణ అవకాశాన్ని పరిశీలించాలని సూచించిందని తెలిపింది. అయితే దక్షిణ మధ్య రైల్వే కొన్ని సాంకేతిక సమస్యలను ప్రస్తావించిందని, నిబంధనలతో కూడిన ఎంఓయూ సమర్పించాలని కోరిందని స్పష్టం చేసింది. దీనికి రైల్వే బోర్డు ఆమోదం తెలపాల్సి ఉందని, రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం అన్నీ జరుగుతాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ట్రైన్ల తిప్పులు, స్టేషన్లలో సౌకర్యాలపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది.
ఇంకా తుది నిర్ణయం జరగలేదు
అయితే ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై ఇంకా తుది నిర్ణయం జరగలేదని, ప్రతిపాదనల దశలో ఉందని తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో దీని గురించి వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తే మాత్రం నమ్మాలని తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరాక ఉచిత ఎంఎంటీఎస్ ప్రయాణంపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొంది. కాగా సోషల్ మీడియాలో జూన్ 2 నుంచి ఉచిత ఎంఎంటీఎస్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. డేట్ ఇంకా ఫిక్స్ కలేదు. కేవలం సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సిందిగా రైల్వేశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై ఇంకా లుదని నిర్ణయం జరగాల్సి ఉంది.
