Hyderabad: పేరుకేమో డాక్టర్లు.. చేసిన పని తెలిస్తే గమ్మున ఉండలేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాకే
చిట్టిల పేరుతో హైదరాబాదులో అమాయకులను నట్టేట ముంచుతున్న ఘటనలు ప్రతిరోజు చోటు చేసుకుంటున్నాయి. కోట్ల రూపాయల చిట్టి డబ్బులు వసూలు చేసి సమయం దొరక్కగానే ప్లేట్ ఫిరాయిస్తూ ఉంటున్న ఇల్లు ఊరు వదిలేసి పరారవుతున్నారు పలువురు చిట్టి వ్యాపారులు. ఆ వివరాలు ఇలా..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షలు రూపాయలు చిట్టి డబ్బులుగా కడుతూ వచ్చిన బాధితులకు చివరికి రూపాయి కూడా తిరిగి ఇవ్వకుండానే ఊరు ఖాళీ చేసి వెళ్లిపోయారు చిట్టి నిర్వాహకులు. నిజాంపేటలో 12 కోట్ల రూపాయల చిట్టి డబ్బులు వసూలు చేసిన దంపతులిద్దరూ అడ్రస్ లేకుండాపోవడంతో 50 మందికి పైగా బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ దంపతుల వద్ద చిట్టి డబ్బులు చెల్లించిన వారిలో అత్యధికంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉండటమే విశేషం. నిజాంపేట లాంటి ప్రాంతాల్లో వీరి నివాసం ఉండటంతో చుట్టుపక్కల వాళ్లందరూ ఐటి ప్రొఫెషనల్స్ ఉన్నారు. అందరి దగ్గర నమ్మకం పొందిన తరువాత చిట్టి బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్నపలంగా ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారు.
నిజాంపేట్‌లోని బండారి లేఅవుట్‌లో రేష్మ క్లినిక్ పేరుతో వైద్యులుగా చెలామణి అవుతున్నారు రేష్మ దంపతులు. స్థానికంగా ప్రతి ఒక్కరితో ఎంతో నమ్మకంగా మెలిగారు. చిట్టీల వ్యాపారం ప్రారంభిస్తున్నట్లు చెప్పడంతో, భార్యభర్తలిద్దరూ దంపతులు కదా అన్న నమ్మకంతో చాలామంది చిట్టీలు వేశారు. ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు చిట్టీలు కూడా వేశారు. అయితే, చిట్టీ గడువు ముగిసినా ఇవ్వకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. అనుకున్నట్లుగానే కోట్ల రూపాయల చిట్టీల డబ్బుతో భార్యాభర్తలిద్దరూ ఉడాయించారు. చివరకు బాధితులు మోసపోయామని, లబోదిబోమంటూ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించి నష్టపోయిన సొమ్ము విలువ కోట్ల రూపాయలు ఉండటంతో, సైబరాబాద్ ఎకానమిక్ అఫెన్స్ వింగ్‌కు బదిలీ చేశారు. దీంతో ఈఓడబ్ల్యూ అధికారులు, అలీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
గతంలో ఎస్ఆర్ నగర్‌లో ఒక నిర్వహకుడు దాదాపు 100 కోట్ల రూపాయల చిట్టి డబ్బులు వసూలు చేసి అడ్రస్ లేకుండాపోయాడు. తాము చెల్లించిన డబ్బుల కోసం అతడి ఇంటి వద్ద రోజుల తరబడి తిరిగినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా నిజాంపేటలోనూ అలానే జరుగుతుందేమో భయంతో బాధితులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే భర్త అలీని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భార్య రేష్మ పాత్రపైన పోలీసులు కూపీ లాగుతున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో చిట్టి బిజినెస్ సర్వసాధారణం. నెల అంతా కష్టపడి వచ్చిన జీవితంలో ఎంతో కొంత డబ్బు పొదుపు చేసుకునేందుకు చిట్టి ల రూపంలో కడుతుంటారు. మధ్యతరగతి కుటుంబాల ఆశలను సమాధి చేస్తూ పలువురు చిట్టి నిర్వాహకులు ఈ తరహాలో అడ్రస్ లేకుండా పోతున్నారు. దీంతో చిట్టి వేసే ఇతర వ్యక్తులు కూడా అసలు చిట్టి వేయడం ఎంతవరకు శ్రేయస్కరం అని ఆలోచించే స్థితికి వచ్చారు.
