నాంపల్లి, నవంబర్ 19: నగరంలోని నాంపల్లిలోని బజార్‌ఘాట్ లోని బాలాజీ రెసిడెన్సీఅపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఈ నెల 13 వ తేదీన ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగుర సభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందడం కలచివేసింది. ఈ నేపథ్యంలో భవనం యజమానిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళ్తే..
నాంపల్లిలోని బజార్‌ఘాట్ లోని బాలాజీ రెసిడెన్సీ యజమాని రమేష్ జైశ్వాల్‌ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. గత కొంత కాలంగా అక్రమంగా కెమికల్స్‌ను విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో పలుసార్లు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. అయినా పద్ధతి మార్చుకోని నిందితుడు అపార్ట్‌మెంట్‌లో డ్రమ్ముల్లో కెమికల్స్ నిల్వ ఉంచి విక్రయిస్తూ ఉండేవాడు. తన నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ కెమికల్ డ్రమ్ములు ఉంచాడు. ఈ నేపధ్యంలో నవంబర్ 13వ తేదీన కారు రిపేర్ చేస్తుండగా ఈ కెమికల్స్ డ్రమ్ములకు నిప్పు అంటుకుంది. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న డీజిల్, కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదంల దాదాపు 10 మంది మృతి చెందారు. అందరూ అపార్ట్మెంట్‌లో అద్దెకు ఉంటున్నవారే. దీనితో రమేష్ ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, ఐపీసీ సెక్షన్లు 285, 286 కింద కేసు నమోదు చేశారు.
దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘నిందితుడు గతంలో చాల అక్రమంగా రసాయనాలను నిల్వ చేస్తూ పట్టుబడ్డాడు. ఎన్ని సార్లు చెప్పిన తన పంథా మార్చుకోలేదు. ఇప్పుడు భారీ ప్రమాదానికి కారణమయ్యాడు. నవంబర్ 11 సాయంత్రం నిందితుడు 35 కిలోల రెసిన్ ఉన్న 32 డబ్బాలను కొనుగోలు చేసాడు. ఆ రెసిన్ కెమికల్ ఉన్న డబ్బాలను గ్రౌండ్ ఫ్లోర్‌లో నిల్వ చేశాడు. ఈ క్రమంలో నిప్పురవ్వలు అంటుకుని మంటలు చెలరేగాయని తెలిపాడు. కాగా గత కొంతకాలంగా సిటీలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాది కాలంలో సికింద్రాబాద్‌లో నాలుగు భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. గత జనవరిలో సికింద్రాబాద్ దక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తర్వాత సిటీలో దాదాపు పదికి పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. తాజాగా నాంపల్లిలోని అపార్ట్ మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించారు. ఇలా వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రజల్లో భయాందోళలు గురి చేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.