AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Triangle Love Story: ట్యాక్సీ డ్రైవర్‌ కోసం వివాహిత రచ్చ.. భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి హైదరాబాద్‌కు!

గుర్తు తెలియని వ్యక్తి తన అందాన్ని పొగడగానే ఓ వివాహిత మనసు గతితప్పింది. నీ నవ్వు ముత్యాల వర్షం కురిపిస్తుందని మెసేజ్‌ చేయగానే తన 17 యేళ్ల వివాహ బందాన్ని కూడా కాలదన్నింది. లండన్‌లో లక్షల్లో సంపాదించే భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, విలాసవంతమైన జీవితాన్ని వదిలి.. ఓ ట్యాక్సీ డ్రైవర్‌ మాయమాటలు నమ్మి..

Triangle Love Story: ట్యాక్సీ డ్రైవర్‌ కోసం వివాహిత రచ్చ.. భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి హైదరాబాద్‌కు!
Married Woman Love Story
Srilakshmi C
|

Updated on: Oct 09, 2024 | 10:09 AM

Share

హైదరాబాద్, అక్టోబర్‌ 9: గుర్తు తెలియని వ్యక్తి తన అందాన్ని పొగడగానే ఓ వివాహిత మనసు గతితప్పింది. నీ నవ్వు ముత్యాల వర్షం కురిపిస్తుందని మెసేజ్‌ చేయగానే తన 17 యేళ్ల వివాహ బందాన్ని కూడా కాలదన్నింది. లండన్‌లో లక్షల్లో సంపాదించే భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, విలాసవంతమైన జీవితాన్ని వదిలి.. ఓ ట్యాక్సీ డ్రైవర్‌ మాయమాటలు నమ్మి భర్త, పిల్లలను వదిలేసి హైదరాబాద్‌కు వచ్చింది. భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, తిరిగి భర్త వద్దకు పంపించేందుకు విమానం ఎక్కించారు. ఈ విచిగ్ర ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఆర్‌జీఐఏ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన ఓ జంటది 17 ఏళ్ల వివాహ బంధం. వీరికి 13 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె సంతానం. కొన్నాళ్ల క్రితం భర్తకు లండన్‌లో జాబ్‌ రావడంతో అతడు అక్కడికి వెళ్లాడు. ఈ ఏడాది ప్రారంభంలో మహిళ తల్లి అనారోగ్యంతో మరణించడంతో ఆమె అస్తికలను కలిపేందుకు వెళ్తూ ఓ ట్యాక్సీని బుక్‌ చేసుకొని వెళ్లి వచ్చింది. అనంతరం సదరు ట్యాక్సీ డ్రైవర్‌ శివకు గూగుల్ పే ద్వారా బిల్లు చెల్లించింది. ఇక అప్పటి నుంచి ఆమెపై కన్నేసిన సదరు డ్రైవర్‌ శివ.. ఆమె ఫోన్‌కు నిత్యం మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినా.. ఆ తర్వాత ఆతని పొగడ్తలకు మహిళ లొంగిపోయింది. దీంతో అతడితో ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన అత్తింటి వారు ఆమె భర్తకు సమాచారం అందించారు. ఈ క్రమంలో గత నెల 16న ఆమెను, పిల్లలను కూడా లండన్‌కు రప్పించాడు. అయితే అక్కడికి వెళ్లినా మహిళ తన తీరు మార్చుకోలేదు. ట్యాక్సీ డ్రైవర్‌ శివతో చాటింగ్‌ కొనసాగించింది.

ఈ క్రమంలో గత నెల 29న భర్త తల్లి చనిపోవడంతో అతను హైదరాబాద్‌ వచ్చాడు. ఆ మరుసటి రోజే వివాహిత తన ఇద్దరు పిల్లలను లండన్‌లోని ఓ పార్కుకు తీసుకొచ్చి అక్కడే వదిలేసి.. ఎవరికీ చెప్పకుండా ట్యాక్సీ డ్రైవర్‌ను బర్త్‌డే వేడుకల కోసం ఆగమేఘాల మీద హైదరాబాద్‌ చేరుకుంది. తల్లి ఎటో వెళ్లిపోయిందని పిల్లలు ఫోన్‌ చేసి చెప్పడంతో భర్త వెంటనే భార్యకు ఫోన్‌ చేశాడు. ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చింది. దీంతో అతను లండన్‌ వెళ్లి ఆరా తీయగా.. భార్య హైదరాబాద్‌ వెళ్లినట్లు తేలింది. తుదకు ఆమెకు కాల్‌ కలవడంతో తనను ఎవరో కిడ్నాప్‌ చేసి శంషాబాద్‌ మధురానగర్‌ నుంచి బాలాపూర్‌ వైపు తీసుకెళ్తున్నట్లు భర్తకు చెప్పింది. వెంటనే భర్త ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా ఆమె గోవాలో ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆమెకు ఫోన్‌ చేయగా తన లైవ్‌ లొకేషన్‌ను పోలీసులకు పంపింది. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌ వస్తున్నట్లు తెలిపింది. ఆమె కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసిన పోలీసులు సోమవారం ఉదయం ఆరాంఘర్‌ వద్ద ట్యాక్సీ డ్రైవర్‌ శివ, వివాహితను అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తన భార్యను తిరిగి లండన్‌ పంపాలని భర్త ఆర్‌జీఐఏ పోలీసులను కోరడంతో.. వారు సోమవారం సాయంత్రం లండన్‌ విమానం ఎక్కించారు. మరోవైపు ట్యాక్సీ డ్రైవర్‌ శివపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.