
ఖమ్మం, డిసెంబర్ 24: ఓ స్కూల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు టీచర్ చెప్పిన పాఠాలు చక్కగా వింటూ.. నోట్స్ రాసుకున్న విద్యార్ధులు బెల్ మోగడంతో అంతా టాయిలెట్స్ వైపు పరుగులు తీశారు. కాసేపటి తర్వాత మళ్లీ గంతులు వేసుకుంటూ క్లాస్ రూంకి చేరుకున్నారు. ఇంతలో అనుకోని సంఘటనతో ఓ విద్యార్ది నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ విషాత ఘటన ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో బుధవారం (డిసెంబర్ 24) మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో బుధవారం (డిసెంబర్ 24) ఉదయం రోజు మాదిరిగానే విహార్ (6) అనే స్థానిక ప్రైవేటు స్కూల్‌కి వెళ్లాడు. యూకేజీ చదువుతున్న విహారం మధ్యాహ్నం పాఠశాల విరామ సమయంలో తోటి విద్యార్ధులతోపాటు టాయిలెట్స్ వైపు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి పరుగెత్తుకుంటూ తరగతి గదికి వస్తుండగా అదుపు తప్పి ఒక్కసారిగా కింద పడిపోయాడు. సరిగ్గా అదే టైంలో బాలుడి చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులో గుచ్చుకుంది. దీంతో చిన్నారి విహార్‌కు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్కూల్ యాజమన్యం 108 వాహనంలో కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే పరిస్థితి చేయిదాటింది. పరీక్షించిన వైద్యలు బాలుడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చిన్నారి మృతి చెందిన వార్త తల్లిదండ్రులకు తెలియడంతో వారి రోధనలు మిన్నంటాయి. రోజూ తమ కళ్లముందే అల్లరి చేస్తూ గంతులు వేసిన చిన్నారి ఉన్నట్లుండి దూరం కావడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.