బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు.? బ్రేకులు వేసినా ఆగని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి..
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు అని ఎవరైనా అంటే, వాళ్ల చెంపలు పగలగొట్టాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు అని ఎవరైనా అంటే, వాళ్ల చెంపలు పగలగొట్టాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇక పొత్తులు ఎత్తులు జాన్తా నై అంటున్నారు బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఎంత ఖండించినా, ఈ పొత్తు ప్రచారానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడడం లేదు. పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ఎన్నికల రణభేరి మోగిస్తోంది. మరోవైపు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలో 14 శాతం ఓట్లు, 8 అసెంబ్లీ సీట్లు సాధించి జోష్ మీదున్న బీజేపీ కూడా ఎన్నికల సమర సన్నాహాలు చేస్తోంది.
ఈ కీలక సమయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తాయంటూ కొద్ది రోజులుగా ఓ ప్రచారం జోరుగా జరుగుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఈ పొత్తు ప్రచారానికి ఎంత గట్టిగా బ్రేకులు వేయాలని చూస్తున్నా అది ఆగడం లేదు. రెండు పార్టీలు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నప్పటికీ అది ఇప్పటికే జనంలోకి బలంగా వెళ్లిపోయింది. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారం, నినాదం ఆ రెండు పార్టీలను బాగా దెబ్బ తీసింది. ఇప్పుడు ఏకంగా పొత్తు వరకు టాపిక్ వెళ్లిపోవడంతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో డ్యామేజ్ మరింత ఎక్కువగా ఉంటుందని బీఆర్‌ఎస్, బీజేపీ భయపడుతున్నాయి. బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని బీజేపీ చాలా బలంగా చెబుతుంటే, అంతకంటే గట్టిగా బీజేపీతో పొత్తులు ఎత్తులు జాన్తా నై అంటోంది బీఆర్ఎస్.
ఈ పొత్తుల ప్రచారానికి ఎలాగైనా ఫుల్‌స్టాప్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌తో పొత్తు వార్తలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇదంతా కుట్రపూరిత ప్రచారం అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు ఉంటుందని ఎవరైనా అంటే వాళ్ల చెంపలు వాయగొట్టమంటున్నారు ఆయన. ఇక బీఆర్‌ఎస్ కూడా అవే తరహా స్టేట్‌మెంట్లు ఇస్తోంది. బీజేపీతో పొత్తు ప్రచారంపై గులాబీ పార్టీ ఎదురు దాడి మొదలు పెట్టింది. తమది సెక్యులర్ పార్టీ అని, బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదంటున్నారు బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్. అయితే ఈ పొత్తుల ప్రచారానికి బీఆర్‌ఎస్, బీజేపీ ఎంత బ్రేకులు వేసినా, ఆ ప్రచారం మాత్రం ఆగకపోవడం ఆ రెండు పార్టీలను కలవర పెడుతోంది అంటున్నారు విశ్లేషకులు.
