AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Couple Friendly Movie Review: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ.. సంతోష్ శోభన్ హిట్టు కొట్టాడా?

వాలెంటైన్స్ డే సందర్భంగా యూత్‌ని టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. మరి సంతోష్ శోభన్ తన మార్క్ యాక్టింగ్‌తో, మానస వారణాసి గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారా..? ఈ 'కపుల్ ఫ్రెండ్లీ' జర్నీ ఎలా సాగిందో రివ్యూలో చూద్దాం రండి.

Couple Friendly Movie Review: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ.. సంతోష్ శోభన్ హిట్టు కొట్టాడా?
Couple Friendly Movie Review
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 14, 2026 | 6:38 AM

Share

మూవీ రివ్యూ: కపుల్ ఫ్రెండ్లీ

నటీనటులు: సంతోష్ శోభన్, మానస వారణాసి, యోగి బాబు, రాజీవ్ కనకాల, గోపరాజు రమణ తదితరులు..

ఎడిటర్: గణేష్ శివ

సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్

సంగీతం: ఆదిత్య రవీంద్రన్

దర్శకత్వం: అశ్విన్ చంద్రశేఖర్

నిర్మాణం: యూవీ క్రియేషన్స్

కథ:

శివ (సంతోష్ శోభన్) ఒక ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలనే లక్ష్యంతో చెన్నైలో అడుగు పెడతాడు. కానీ అవకాశాలు రాక సర్వైవల్ కోసం బైక్ టాక్సీ రైడర్‌గా పనిచేస్తుంటాడు. మరోవైపు మిత్ర (మానస వారణాసి) ఐటీ జాబ్ ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తూ స్ట్రగుల్ అవుతుంటుంది. వీరిద్దరూ అనుకోని పరిస్థితుల్లో కలుస్తారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, తప్పనిసరి పరిస్థితుల్లో ఒకే రూమ్‌లో ఉండాల్సి వస్తుంది. వేర్వేరు లక్ష్యాలతో ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది..? సొసైటీ నుంచి, పేరెంట్స్ నుంచి వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి..? చివరికి వీరు ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా కథ..

కథనం:

సంతోష్ శోభన్, మానస మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకి మేజర్ హైలైట్. ఇద్దరూ చాలా ఫ్రెష్‌గా, క్యూట్‌గా కనిపించారు. వారి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, చిన్న చిన్న గొడవలు ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. రిలేటబిలిటీ పాయింట్స్ ఈ సినిమాలో మరో బలం. జాబ్ కోసం వెయిటింగ్, సిటీ లైఫ్‌లో స్ట్రగుల్స్, లివింగ్ టుగెదర్ వంటి అంశాలు ప్రజెంట్ యూత్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. డైరెక్టర్ ఈ పాయింట్స్ ని చాలా నేచురల్ గా డీల్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బ్యూటిఫుల్‌గా సాగుతుంది. హీరో హీరోయిన్ల పరిచయం, వారు పడే పాట్లు, ఆ తర్వాత ఒకరికొకరు దగ్గరయ్యే సన్నివేశాలు చాలా ప్లెజెంట్ గా ఉంటాయి. కథలో పెద్దగా కొత్తదనం లేదు. మనం ఇదివరకే చూసిన చాలా రొమాంటిక్ సినిమాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు.

ఫస్ట్ హాఫ్ ఉన్నంత గ్రిప్పింగ్‌గా సెకండ్ హాఫ్ ఉండదు. ఎమోషనల్ సీన్స్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తాయి. క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్ గా డీల్ చేశారు. టైటిల్‌కి తగ్గట్టే సినిమాలో కొన్ని బోల్డ్ అండ్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇవి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇది పక్కా యూత్ సినిమా.. కానీ సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ కనెక్టింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమా మూడ్ పెంచేసింది. ఇలాంటి లవ్ స్టోరీలో యోగి బాబు కామెడీ రిలీఫ్ అనిపిస్తుంది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఒక డీసెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్. రొటీన్ కథే అయినా.. సంతోష్-మానసల కెమిస్ట్రీ, ఫ్రెష్ ట్రీట్‌మెంట్ వల్ల సినిమా బోర్ కొట్టదు. లాజిక్కులు వెతకకుండా, ఒక క్యూట్ లవ్ స్టోరీ చూడాలనుకునే కపుల్స్ కి, యూత్ కి ఈ సినిమా నచ్చుతుంది.

నటీనటులు:

సంతోష్ శోభన్ పక్కింటి కుర్రాడిలా చాలా ఈజీగా నటించేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో, కామెడీ టైమింగ్‌లో సంతోష్ మెప్పించాడు. ఇక మానస వారణాసి అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మోడరన్ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. యోగి బాబు ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు.

టెక్నికల్ టీం:

ఆదిత్య రవీంద్రన్ మ్యూజిక్ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేసింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. చెన్నై బ్యాక్‌డ్రాప్‌ని కెమెరామెన్ దినేష్ చాలా కలర్‌ఫుల్‌గా చూపించారు. ఎడిటర్ వర్క్ కూడా ఓకే. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ రొటీన్ కథతోనే చిన్న సైజ్ మ్యాజిక్ చేశాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా కపుల్ ఫ్రెండ్లీ.. డీసెంట్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా..!