AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : అభిషేక్ శర్మ అంటే పాకిస్థాన్‌కు అంత భయమా? మ్యాచ్‌కు ముందే మైండ్ గేమ్స్ మొదలెట్టిన మాజీలు

IND vs PAK : ఫిబ్రవరి 15, ఆదివారం నాడు కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్న భారత్ - పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ పోరుకు రంగం సిద్ధమైంది. అయితే మ్యాచ్ మొదలవ్వక ముందే మైదానం బయట మాటల యుద్ధం ముదిరింది.

IND vs PAK : అభిషేక్ శర్మ అంటే పాకిస్థాన్‌కు అంత భయమా? మ్యాచ్‌కు ముందే మైండ్ గేమ్స్ మొదలెట్టిన మాజీలు
Abhishek Sharma
Rakesh
|

Updated on: Feb 14, 2026 | 6:22 AM

Share

IND vs PAK : ఫిబ్రవరి 15, ఆదివారం నాడు కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్న భారత్ – పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ పోరుకు రంగం సిద్ధమైంది. అయితే మ్యాచ్ మొదలవ్వక ముందే మైదానం బయట మాటల యుద్ధం ముదిరింది. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మను టార్గెట్ చేస్తూ పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. అభిషేక్ బ్యాటింగ్ స్టైల్‌ను కించపరుస్తూ పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

పాకిస్థాన్ టీవీ షోలో పాల్గొన్న మాజీ పేసర్ మహమ్మద్ అమీర్, టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై నోరు పారేసుకున్నాడు. అభిషేక్ ఒక టెక్నిక్ లేని బ్యాటర్ అని, అతను కేవలం స్లాగర్ మాత్రమేనని అమీర్ ఎద్దేవా చేశాడు. “అభిషేక్ శర్మకు ప్రతి బంతినీ బాదడం తప్ప ఏమీ తెలియదు. అతను ఆడే 8 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కటి మాత్రమే క్లిక్ అవుతుంది. అతన్ని అవుట్ చేయడం చాలా ఈజీ. బాడీకి దగ్గరగా స్వింగ్ చేస్తే చాలు అభిషేక్ దొరికిపోతాడు” అంటూ తన అక్కసు వెళ్లగక్కాడు. అమీర్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

అభిషేక్ శర్మ ఈ మెగా మ్యాచ్‌లో ఆడతాడా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్ సమయంలో అతను అస్వస్థతకు గురవడంతో, నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని సమాచారం అందుతున్నప్పటికీ, తుది నిర్ణయం మాత్రం మ్యాచ్ రోజే తీసుకోనున్నారు. అయితే అభిషేక్ శర్మ ఒకవేళ మైదానంలోకి దిగితే మాత్రం పాక్ బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే పాక్ మాజీలు అతనిపై ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడుతున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరోవైపు పాక్ మాజీ వికెట్ కీపర్ కామ్రాన్ అక్మల్ మాత్రం కాస్త వాస్తవానికి దగ్గరగా మాట్లాడారు. “టీమిండియాలో కేవలం ఒక్క అభిషేక్ శర్మ మాత్రమే లేడు.. ఆ జట్టులో ఉన్న ప్రతి బ్యాటర్ ఒక అభిషేక్ శర్మలాగే విరుచుకుపడగలరు” అంటూ పాక్ జట్టును హెచ్చరించారు. భారత జట్టులోని బ్యాటింగ్ డెప్త్‌ను చూసి పాకిస్థాన్ బౌలర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో, భారత్ జట్టులోని స్పిన్ ఆల్ రౌండర్లు పాకిస్థాన్‌కు చుక్కలు చూపించే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..