తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సెక్రెటేరియట్ ను మొదట సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభం చేయాలనుకున్నారు. అయితే ఇంతలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ ఉండడంతో సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టుగా తెలంగాణ సర్కార్ తెలిపింది. కాగా సచివాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా ముందస్తు ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత పరేడ్‌గ్రౌండ్ లో భారీ సభను కూడా నిర్వహించాలని తలపెట్టారు. ఈ సభకు సంబంధించి తమిళనాడు, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్, హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తదితరనేతలకు ఆహ్వానాలు కూడా అందాయి. అయితే ఇంతలోనే సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
కాగా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. త్వరలో ఖాళీ కానున్న స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలు, తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..