పాకిస్తాన్ దొంగనాటకాలను ప్రపంచ దేశాల ముందుకు తీసుకెళ్తాం.. అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు..
ఎంత చెప్పినా పాకిస్థాన్ ఉగ్ర బుద్ధి మారదని, ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్‌లో సైనిక దుస్తులు ధరించి వచ్చి మరీ అమాయక ప్రజల ప్రాణాలు తీయడం హేయమైన చర్య అని ఓవైసీ అన్నారు.

కశ్మీర్ ఉగ్రదాడిలో ఎంతోమంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు.. కశ్మీర్ అందాలను ఆస్వాదిద్దామని సరదాగా కుటుంబాలతో కలిసి పహల్గామ్ వెళ్లిన 26 మంది పర్యాటకులు టెర్రరిస్టుల రక్తదాహానికి బలయ్యారు. ఇప్పటికీ ఆ మరణహోమాన్ని భారతదేశ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఎంతో మంది జీవితాల్లో చీకటి నింపిన ఉగ్రవాదుల దుశ్చర్యకు బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.. అయితే పాక్ వక్రబుద్ధికి భారత ప్రభుత్వం కూడా సరైన సమాధానం చెప్పింది. శత్రుదేశం పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించి కోలుకోలేని స్థితికి తెచ్చింది. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రస్థవరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో.. భారత్.. కాల్పుల విరమణకు అంగీకరించి మాటల వరకే పరిమితం చేసింది. భారత్ పేరు తలిస్తేనే భయపడేలా పాక్‌ను కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలో పాక్ వక్రబుద్ధిపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. పహల్గామ్ ఉగ్రదాడిపై మండిపడ్డారు. పహల్గామ్‌లో అమాయకులపై టెర్రరిస్టులు కాల్పులు జరపడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఎందరో అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్‌కు సరైన బుద్ధి చెప్పాలని అన్నారు.
అయితే.. ఇదివరకే పాకిస్థాన్ దుశ్చర్యను ఖండించిన ఓవైసీ.. ఈ సారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా పాకిస్థాన్ ఉగ్ర బుద్ధి మారదని, ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్‌లో సైనిక దుస్తులు ధరించి వచ్చి మరీ అమాయక ప్రజల ప్రాణాలు తీయడం హేయమైన చర్య అని ఓవైసీ అన్నారు. ఇక ముస్లిం మైనార్టీల ప్రస్తావన తీసుకొస్తూ అసదుద్దీన్ ఓవైసీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కంటే భారతదేశంలోనే ఎక్కువ మంది ముస్లింలు జీవిస్తున్నారని అన్నారు. ముస్లిం అయినంత మాత్రాన దేశానికి శత్రువులుగా చూడరాదని, ఇస్లాంలో అసలు ఇలాంటి ఘటనలకు తావులేదని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో తాజాగా వార్తల్లో నిలుస్తున్న బాయ్‌కాట్ టర్కీ వివాదంపై ఓవైసీ స్పందించారు. టర్కీకి భారతదేశంతో అనేక చారిత్రక సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చే తమ వైఖరిని టర్కీ పునః పరిశీలించుకోవాలని కోరారు. పాకిస్థాన్ ఉగ్రదాడి నేపథ్యంలో ఓవైసీ దేశ భద్రత, పరిరక్షణ దృష్ట్యా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పలు దేశాల్లో పర్యటించి పాకిస్థాన్ వక్రబుద్ధిని ఆయా దేశాలకు తెలియజేస్తామని చెప్పారు. UK, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ డెన్మార్క్ దేశాల్లో పర్యటించి భారతదేశం తరపున నిలిచి ఉగ్రవాదాన్ని అరికట్టే చర్యలకు తమ పార్టీ ఎల్లప్పుడూ శాయశక్తులా కృషి చేస్తుందని అసదుద్దీన్ ఓవైసీ వివరించారు. పాకిస్తాన్ దొంగనాటకాలు ప్రపంచ దేశాల ముందుకు తీసుకెళ్తామని వివరించారు.
ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటం గురించి వివరించడానికి కీలక దేశాలను సందర్శించే అఖిలపక్ష బృందంలో తాను కూడా ఉన్నందున, తన బాధ్యతను నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దీనిని “ముఖ్యమైన” పనిగా అభివర్ణించిన ఒవైసీ, పాకిస్తాన్ భారతదేశాన్ని ఎలా అస్థిరపరచాలనుకుంటుందో ప్రపంచానికి చెప్పడమే తన పని అని అన్నారు. ఈ పర్యటనలో అన్ని వాస్తవాలను ప్రపంచం ముందు ఉంచుతామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
