ఏముంది అక్కడ కొబ్బరిపీచేగా అనుకుంటే పొరపడినట్లే.. పోలీసులే స్టన్ అయ్యారు..
ఎందెందు వెతికినా అదే.. ఇన్‌కమ్ బాగా ఉండటంతో అక్రమార్కులు అస్సలు తగ్గడం లేదు. వీరి నెట్ వర్క్ ఇండియాలో మాత్రమే కాదు. విదేశాలకు సైతం విస్తరించింది. అయితే వీరి క్రైమ్ చేసేప్పుడు క్రియేటివిటీ ప్రదర్శిస్తున్నారు. పోలీసులకు ఏ మాత్రం చిక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే కలుగులో ఉన్న ఎలుక ఎప్పటికైనా బయటకు రాక తప్పుతుందా..? అలానే....
కొబ్బరి పీచు రవాణా ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసింది రాచకొండ ఎస్ఓటి టీమ్. గత కొంత కాలంగా పోలీసుల కళ్ళు గప్పి గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా నుండి సుమారు 75 లక్షల రూపాయల విలువైన 250 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మలై స్వామి, రామర్‌లు హైదరాబాద్‌కు వలస వచ్చి చాంద్రాయణగుట్టలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా ఇద్దరు కలిసి గంజాయిని రవాణా చేస్తున్నారు. వీరిద్దరికి కేరళకు చెందిన రాజేష్, ఒడిశాకి చెందిన చంద్ర శేఖర్‌లు పరిచయమయ్యారు. మలై స్వామి రామర్‌లు గంజాయిని హైదరాబాద్‌కు తీసుకొని రాగా, రాజేశ్ రిసీవ్ చేసుకుంటాడు. చంద్రశేఖర్ ఆ గంజాయిని అమ్ముతాడు. ఇలా నలుగురు కలిసి గంజాయి రవాణా చేయడం అమ్మడం, చేస్తున్నారు.
ఈ ముఠాకు సంబంధించిన ఇద్దరు గంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారం అందుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సుమారు 250 కిలోల గంజాయిని కొనుగోలు చేసి డీసీఎం వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పోలీసులకు కనిపించకుండా డీసీఎం వాహనంలో కొబ్బరి పీచును అడ్డుగా పెట్టి తరలిస్తున్న వైనాన్ని గుట్టురట్టు చేశారు. గంజాయి తరలిస్తున్న మలై స్వామి, రామర్‌లను అరెస్టు చేశారు. వీరి నుండి 250 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మలై స్వామి, రామర్‌లు ఇప్పటి వరకు రెండు సార్లు గంజాయిని హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్లు గుర్తించారు.
హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, తమిళనాడులకు వీరు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని సీపీ చెబుతున్నారు. అంతేకాదు శ్రీలంకకు కూడా గంజాయిని ఎగుమతి చేస్తున్నట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. గంజాయి సరఫరా చేసే వారి పైన కాకుండా ఇకమీదట వినియోదారులపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని రాచకొండ కమిషనర్ చౌహన్ చెబుతున్నారు. ఇప్పటివరకు సుమారు 100 మంది గంజాయి తీసుకునేవారిపై కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ ముఠా నగరంతో పాటు ఇంకా ఏ ఏ ప్రాంతంలో సరఫరా చేశారో దర్యాప్తులో గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..