తెలివి మీరి పోతున్న గంజాయి స్మగ్లర్లు.. హోలీకి ముందుగానే కొత్త ఎత్తుగడతో రంగంలోకి.. కట్ చేస్తే…
హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణాకు కొత్త పంథా తెరపైకి వచ్చింది. ఎక్సైజ్ శాఖ నిఘాతో, నిందితులు గంజాయిని 'బంగ్' గోళీలు, చాక్లెట్ల రూపంలో మార్చి విక్రయిస్తున్నారు. ఎస్టీఎఫ్ ఏ టీమ్ ప్రత్యేక నిఘాలో చూడీబజార్, శంకర్‌బజార్‌లలో దాడులు నిర్వహించి లవకుశ్ శర్మ, భాను ప్రతాప్‌లను అరెస్టు చేసింది. భారీగా 'బంగ్' గోళీలు, గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కొత్త తరహా మాదకద్రవ్యాల వ్యాపారం వెలుగులోకి వచ్చింది. గంజాయిని నేరుగా అమ్మితే అధికారులు పట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కొందరు అక్రమార్కులు కొత్త పద్ధతులకు పాల్పడుతున్నారు. గంజాయిని రుబ్బి గోళీల రూపంలో తయారు చేసి వాటికి “బంగ్” అనే పేరుతో విక్రయాలు సాగిస్తున్న ఘటన తాజాగా బయటపడింది. ఈ వ్యవహారాన్ని ఎస్టీఎఫ్ ఏ టీమ్ అధికారులు గుర్తించి దాడులు నిర్వహించారు. ఎస్టీఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం నగరంలోని చూడీబజార్, శంకర్‌బజార్ ప్రాంతాల్లో గంజాయి ఆధారిత పదార్థాల విక్రయాలపై నిఘా పెట్టింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా అధికారులు తనిఖీలు చేపట్టగా బంగ్ గోళీల తయారీ, విక్రయాలు జరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం అనుమానితుడు నివాసంలో దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన లవకుశ్ శర్మ నగరంలోని చూడీబజార్ ప్రాంతంలో ఇంటి మూడో అంతస్తు నివాసంలో గంజాయి ఆధారిత పదార్థాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ నిర్వహించిన తనిఖీల్లో 1.30 కిలోల బంగ్ గోళీలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 200 గ్రాముల గంజాయి చాక్లెట్లు కూడా పట్టుబడ్డాయి. ఈ పదార్థాలను ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి విక్రయాలకు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. గంజాయి చాక్లెట్లు, బంగ్ గోళీల రూపంలో మాదక పదార్థాలను విక్రయించడం ద్వారా పోలీసుల దృష్టికి చిక్కకుండా ఉండాలని నిందితులు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. సాధారణంగా బంగ్ పేరుతో అమ్మకాలు సాగిస్తే అనుమానం రాకపోవచ్చని భావించి ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
సీజ్ చేసిన బంగ్ గోళీలు గంజాయిని మెత్తగా రుబ్బి ఇతర పదార్థాలతో కలిపి తయారు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ గోళీలను చిన్న ప్యాకెట్లలో ఉంచి వినియోగదారులకు విక్రయాలు సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం ఒక్కో బంగ్ గోళీని రూ.100 చొప్పున విక్రయిస్తూ నిందితులు అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ బంగ్ గోళీలకు డిమాండ్ ఉన్నట్లు విచారణలో తెలిసింది. ఎస్టీఎఫ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో లవకుశ్ శర్మతో పాటు భాను ప్రతాప్ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి గంజాయి ఆధారిత పదార్థాలను తయారు చేసి విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




