Hyderabad: మహిళలను వేధించే పోకిరీల బెండు తీస్తున్న షీ టీమ్స్.. వారంలోనే ఇంత మంది అరెస్టా!
నగరంలో రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న వేధింపుల నేపథ్యంలో మహిళల భద్రతపై హైదరాబాద్ షీటీమ్స్ ఫోకస్ పెట్టారు. ఎక్కడికక్కడ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలను పట్టుకొని బెండుతీస్తున్నారు. ఇందులో భాగంగానే ఆగస్టు 3 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌లో 33 మందిని సైబరాబాద్ షీ టీమ్స్ అరెస్ట్ చేశారు.

ఆడాళ్ల జోలికి వస్తే తోలు తీస్తామంటున్నారు హైదరాబాద్ షీ టీమ్స్. నిత్యం పబ్లిక్ ప్లేసుల్లో మారు వేషాల్లో గస్తీ కాస్తూ ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా మహిళలను పబ్లిక్ ప్రదేశాల్లో వేధించిన 33 మందిని సైబరాబాద్ షీ టీమ్స్ అరెస్ట్ చేశాయి. ఆగస్టు 3 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌లో ఈ అరెస్టులు జరిగాయి. వివిధ సోర్సుల ద్వారా మహిళల నుంచి వచ్చిన 25 ఫిర్యాదులకు షీ టీమ్స్ తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాయి. అంతే కాకుండా, కాపురంలో విబేధాలతో సతమతం అవుతున్న 21 జంటలకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లలో కూర్చోబెట్టి మాట్లాడి, సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు.
జూలై నెలలో మాత్రమే షీ టీమ్స్ 49మందిని అరెస్ట్ చేశారు. 48 పెట్టి కేసులు నమోదు చేసి, అందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళా బాధితుల నుంచి 30 ఫిర్యాదులు అందుకుని.. వాటిపై తక్షణ చర్యలు చేపట్టారు. మహిళలు, బాలికల భద్రత కోసం 64 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సైబరాబాద్ ఉమెన్ & చిల్డ్రన్ సేఫ్టీ వింగ్‌లో 5 కౌన్సెలింగ్ సెషన్లు కూడా ఏర్పాటు చేశారు. సైబరాబాద్ షీ టీమ్స్ 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ.. మహిళల భద్రత కోసం కట్టుబడి ఉన్నాయని అధికారులు వివరించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా మహిళలు నిరభ్యంతరంగా షీ టీమ్స్‌ను సంప్రదించాలని.. కోరితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




