Hyderabad: పాశమైలారంలో మరో అగ్నిప్రమాదం.. భయాందోళనలో స్థానిక ప్రజలు, కార్మికులు!
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇటీవల సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి 44 మంది మరణించిన సంఘటన నుంచి ప్రజలు తేరుకోకముందే అదే ప్రాంతంలో మరో ప్రమాదం సంభవించడం స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

ఈ మధ్య కాలంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నా.. పరిశ్రమల యజమానులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇటీవల పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి 44 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ప్రమాదం నుంచి పూర్తి తేరుకోకముందే పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన కార్మికులు ఎక్కడిపనులు అక్కడే వదిలేసి వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఆ తర్వాత వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికైతే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగలేదని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఇండస్ట్రియల్ ఎరియాలో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడంతో పరిశ్రమల్లోని భద్రతా చర్యలపై పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులు భద్రతా చర్యలు చేపట్లేదని.. వీటిపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




