Hyderabad: కట్టుకున్న వాడే కాలయముడై.. భార్యను చున్నీతో ఉరివేసి హతమార్చిన భర్త..

| Edited By: Jyothi Gadda

Nov 19, 2024 | 1:14 PM

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కానీ, ఇక్కడ ఓ అభాగ్యురాలిని ఆ పెళ్లే మృత్యుఒడికి చేర్చింది. తల వంచి తాళి కట్టించుకున్న పాపానికి.. ఆ తర్వాత అదే మెడకు ఉరి తాడు బిగుస్తుందని ఊహించలేకపోయింది పాపం. చేయని తప్పుకు శిక్ష అన్నట్లు ఇష్టం లేని పెళ్లి చేశారని కట్టుకున్న భర్తే ఆమెను దారుణంగా హతమార్చిన ఘటన ఇది. కన్నీళ్లు పెట్టించే ఈ ఉదంతం మరెక్కడో కాదు, మన హైదరాబాద్ నగరంలోనే చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Hyderabad: కట్టుకున్న వాడే కాలయముడై.. భార్యను చున్నీతో ఉరివేసి హతమార్చిన భర్త..
Husband Kills His Wife
Follow us on

బాలాపూర్ రాయల్ కాలనీకి చెందిన జాహిద్ హుస్సేన్ (21)కు 7 నెలల క్రితం రోజినా బేగం(19)తో వివాహం జరిగింది. అయితే.. తనకు ఇష్టం లేని పెళ్లిని చేశారని జాహిద్ హుస్సేన్ అమ్మతో పాటు భార్య రోజినా బేగంతో తరచూ గొడవ పడుతుండేవాడు. చాలాసార్లు ఇదే విషయమై దంపతుల మధ్య గొడవల కారణంగా కాపురం సజావుగా సాగలేదు. పాపం.. తాళి కట్టించుకున్న పాపానికి, తన ప్రమేయం లేకుండా జరిగిన పెళ్లికి ఆ యువతి కూడా ఏమీ చేయలేక తన బతుకు ఇంతే అన్నట్లు భర్త ఎన్ని తిట్టినా భరించేది.

ఈ క్రమంలోనే నవంబర్ 14వ తేదీ తెల్లవారుజామున జాహిద్ హుస్సేన్ భార్యతో యథాప్రకారం గొడవ పడ్డాడు. కాసేపటికి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అప్పటికే ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న జాహిద్ విచక్షణ కోల్పోయి తాను ఏం చేస్తున్నానో కూడా తెలియనట్లుగా ప్రవర్తించాడు. భార్యమెడకు చున్నీతో ఉరి బిగించే ప్రయత్నం చేస్తుండగా,  ఆమె గట్టిగట్టిగా కేకలు వేసింది. ఆ శబ్దాలకు చుట్టుపక్కల వాళ్లు నిద్ర లేవడంతో భయపడిన పోయిన ఆమె భర్త అక్కడి నుంచి పరారయ్యాడు.

మెడకు ఉరి బిగుసుకోవడంతో తీవ్రంగా గాయపడిన రోజినా బేగంను స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోజినా బేగం పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందింది. భర్త అప్పటి నుంచే పరారీలో ఉన్నాడు. కాగా, బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు తప్పించుకు తిరుగుతున్న జాహిద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపంతోనే కట్టుకున్న భార్యను చున్నీతో ఉరి బిగించి భర్త జాహిద్ హుస్సేన్ హత్య చేశాడని, కేసును మరింత లోతుగా పరిశీలించి నిందితుడికి తగిన శిక్ష పడేలా చేస్తామని బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..