తెలంగాణ(Telangana) గ్రూప్-1 కు దరఖాస్తులు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు పోటెత్తాయి. ఎన్నడూ లేనంతగా ఒక్కో పోస్టుకు సగటున 756 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులు సాధిస్తే భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అయ్యే అవకాశం ఉండటంతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చాలామంది అప్లై(Applications for Group-1) చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ గ్రూప్-1కు మే 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజుల్లో తక్కువ దరఖాస్తులు రాగా.. చివరి సమయంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. చివరి రెండు రోజుల్లోనే సగటున 42,500 చొప్పున 85వేల దరఖాస్తులు, గడువు జూన్ 4 వరకు పొడిగించిన తరువాత నాలుగు రోజుల్లో కలిపి 28,559 దరఖాస్తులు అందాయని కమిషన్ వెల్లడించింది. ఈ గణాంకాలను బట్టి చూస్తుంటే.. గ్రూప్-1కు ఎంత భారీ పోటీ ఉందో అర్థమవుతోంది.
గ్రూప్-1 లోని 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీలో ఉన్నారు. అయితే మహిళా అభ్యర్థులు జనరల్ పోస్టుల్లోనూ మెరిట్ సాధిస్తే మరిన్ని పోస్టులు పొందే అవకాశం ఉంది. దివ్యాంగుల కేటగిరీలోని 24 పోస్టులకు 6,105 మంది దరఖాస్తు చేసుకోగా ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీలో ఉన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి