Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Hyderabad: హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ప్రధాన రహదారులు వరద కాలువులను తలపిస్తున్నాయి.
Hyderabad: హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ప్రధాన రహదారులు వరద కాలువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతలన్నీ నీట మునిగాయి. వరద నీరు ఇంట్లోకి రావడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మియాపూర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై.. ఉరుములు, మెరుపులతో విరుచుకుపడుతోంది. రోడ్లన్నీ జలమయం కాగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్ ,అబిడ్స్ ,నాంపల్లి ,బషీర్ బాగ్ లక్డికపూల్, హియయత్ నగర్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని… ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం వుందని వెల్లడించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.