ఈసారి కూడా టీ 20 టైటిల్ ఫేవరెట్ మేమే..! ఆ సత్తా మాకు కచ్చితంగా ఉందంటున్న డారెన్ సామి..
T 20 World Cup: ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి నవంబర్ వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ),
T 20 World Cup: ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి నవంబర్ వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ), ఒమన్‌లో టి 20 ప్రపంచ కప్ జరగనుంది. టోర్నీకి దాదాపు రెండు నెలల సమయం ఉంది కానీ అప్పుడే ఈసారి ఏ జట్టు ట్రోఫీని గెలుచుకుంటుందనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. టీమిండియాతో సహా చాలా జట్లు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాయి. ఈ సందర్భంగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఈసారి తమ జట్టు టైటిల్‌ను కాపాడుకోవడంలో విజయం సాధిస్తుందని చెబుతున్నాడు. సామీ కెప్టెన్సీలో విండీస్ 2016 లో భారతదేశంలో టీ 20 ప్రపంచకప్ గెలిచింది. అతడి ప్రకారం.. టీ 20 ఫార్మాట్‌కి తగినట్లుగా తమ జట్టు మారుతుందని, అన్ని జట్లకు పోటీ ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
పురుషుల టీ 20 ప్రపంచకప్ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనుంది. 2016లో భారతదేశంలో జరిగిన టి 20 వరల్డ్ కప్ ఫైనల్‌లో వెస్టిండీస్ ఇంగ్లాండ్‌ను ఓడించి రెండోసారి టైటిల్ గెలుచుకుంది. అంతకుముందు వెస్టిండీస్ 2012లో టీ 20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఐసిసి (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) డిజిటల్ ప్రోగ్రామ్‌లో సామీ ఇలా పేర్కొన్నాడు. “వెస్టిండీస్ జట్టు కచ్చితంగా ఛాంపియన్ అవుతుంది అది మాత్రమే నాకు తెలుసు” అన్నాడు.
అంతేకాకుండా “మీరు వెస్టిండీస్ జట్టు చాలా బలహీనంగా ఉందని అనుకోవచ్చు కానీ చివరి నాలుగు (మూడు) టోర్నమెంట్‌లలో మేము చాలా బాగా ఆడాం. రెండింటిలో విజయం సాధించాం. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. కెప్టెన్ కీరాన్ పొలార్డ్ తిరిగి వచ్చాడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, ఎవిన్ లూయిస్‌ల సామర్థ్యం ఏపాటిదో అభిమానులకు తెలుసునని” చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు సామి కెప్టెన్సీలో వెస్టిండీస్ జట్టు రెండుసార్లు టి 20 ప్రపంచ కప్ గెలిచింది.