తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ప్రియురాలు నీహారికను పోలీసులు అరెస్ట్ చేశారు. నీహారికతోపాటు హాసన్ అనే మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిని A1, A2 నిందితులుగా చేర్చి సోమవారం (మార్చి 6) హయత్ నగర్ న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పరిచారు. వీరికి హయత్ నగర్ న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో నిందితులైన నీహారిక, హాసన్‌లను కోర్టు నుంచి నేరుగా వేరు వేరు జైళ్లకు తరలించారు. వీరిలో నీహారికను చంచల్‌గూడ జైలుకు, హసన్‌ను చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. కాగా గత నెల (ఫిబ్రవరి) 17న నల్గొండలో సంచలనంరేపిన బీటెక్ విద్యార్థి నవీన్‌ను హరిహర కృష్ణ హత్య చేసిన తీరు అత్యంత సంచలనంగా మారింది. మూడు నెలలకు ముందే పథకం పన్ని ఫిబ్రవరి 17 రాత్రి 12 గంటల ప్రాంతంలో నవీన్‌ను నిందితుడు గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం కత్తితో నవీన్ శరీర భాగాలను వేరు చేసి ఆ ఫోటోలను గర్ల్ ఫ్రెండ్‌కి మెసేజ్ పెట్టాడు. తర్వాత తలతో సహా శరీర విడిభాగాలను బ్యాంగ్‌లో తీసుకెళ్లిన హరి.. ఫిబ్రవరి 24న హత్య జరిగిన ప్రాంతానికి తిరిగి వచ్చి నవీన్ శరీర భాగాలను తగులబెట్టాడు. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు లొంగిపోయాడు.
గర్ల్‌ఫ్రెండ్ అయిన నీహారిక ప్రేమ వ్యవహారంలో హరిహర కృష్ణ ఈ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్య గురించి నిహారికకు కూడా తెలుసని.. హత్య జరిగిన తర్వాత ప్రియుడు హరిహరను గుడ్ బాయ్ అంటూ నిహారిక మెచ్చుకోవడం, ఘటనాస్థలానికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారని పోలీసుల విచారణలో బయటపడింది. ఆధారాలు దొరకకుండా ఫోన్‌లోని చాటింగ్‌ను తొలగించేందుకు నీహారిక ప్రయత్నించడం కూడా ఈ కేసులో కీలకంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.