AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ, వసతి.. ఇదిగో పూర్తి వివరాలు

ఇంటర్ పూర్తి చేసిన ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థినులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇండిగోరీచ్ భాగస్వామ్యంతో ఉచిత కమర్షియల్ పైలట్ శిక్షణ, వసతి, భోజనం, వైద్య బీమా, మెంటార్షిప్ వంటి పూర్తి సౌకర్యాలు కల్పించనున్నాయి. అర్హులైన విద్యార్థినులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని విమానయాన రంగంలో కెరీర్ నిర్మించుకునే అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ, వసతి.. ఇదిగో పూర్తి వివరాలు
Free Pilot Training
Prabhakar M
| Edited By: |

Updated on: Aug 05, 2026 | 8:08 AM

Share

హైదరాబాద్: విమానయాన రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనే కలలు కనే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల అమ్మాయిలకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్ విద్య పూర్తిచేసిన అర్హత కలిగిన విద్యార్థినులకు ఉచితంగా కమర్షియల్ పైలట్ శిక్షణ అందించేందుకు ఇంటర్ విద్యాశాఖ, ఇండిగో సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) విభాగమైన ఇండిగోరీచ్ పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక కారణాలతో పైలట్ శిక్షణకు దూరమవుతున్న యువతులకు ప్రపంచ స్థాయి అవకాశాలు లభించనున్నాయి.

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్, భారత్ కేర్స్ ట్రస్ట్ ప్రతినిధి సి. సాయి ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఇండిగోరీచ్, భారత్ కేర్స్ ట్రస్ట్ భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ‘గివింగ్ వింగ్స్ టు ఫ్లై’ కార్యక్రమాన్ని తెలంగాణలో కూడా విస్తరించేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది.

ఈ పథకం కింద ఎంపికయ్యే విద్యార్థినులకు సుమారు 20 నెలల పాటు సమగ్ర శిక్షణ అందించనున్నారు. ఇందులో కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) శిక్షణతో పాటు ఏటీఆర్ టైప్ రేటింగ్ కూడా ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక విమానయాన రంగంలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా కోర్సును రూపొందించారు. సాధారణంగా లక్షల రూపాయల ఖర్చుతో పూర్తయ్యే ఈ శిక్షణను ఎంపికైన అభ్యర్థులకు పూర్తిగా ఉచితంగా అందించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

శిక్షణ కాలంలో విద్యార్థినులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అన్ని సౌకర్యాలను ఇండిగోరీచ్, భారత్ కేర్స్ ట్రస్ట్ కల్పించనున్నాయి. వసతి, భోజనం, వైద్య బీమా, మెంటార్షిప్, కెరీర్ గైడెన్స్, శిక్షణకు సంబంధించిన ఇతర ఖర్చులన్నింటినీ ఆయా సంస్థలే భరించనున్నాయి. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఉన్నత లక్ష్యాలను వదులుకోవాల్సిన పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్… ఈ ఒప్పందం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు విమానయాన రంగంలో అడుగుపెట్టే అవకాశం కలుగుతుందని తెలిపారు. పైలట్ కావాలనే ఆశయం ఉన్న అమ్మాయిలకు ఇది జీవితాన్ని మార్చే అవకాశం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక వెబినార్లు నిర్వహించి ఈ అవకాశాన్ని ఎక్కువ మందికి చేరవేస్తామని చెప్పారు.

విద్యార్థినుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలను అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

భారతదేశంలో పైలట్ శిక్షణకు భారీ వ్యయం కావడం వల్ల ప్రతిభ ఉన్న అనేక మంది విద్యార్థులు తమ కలలను మధ్యలోనే వదులుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత నిధులతో ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు అందుబాటులోకి రావడం యువతకు కొత్త అవకాశాలను తెరుస్తుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మహిళలు సాంప్రదాయ ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా విమానయాన వంటి అత్యున్నత రంగాల్లో కూడా రాణించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్‌లో మరింత మంది విద్యార్థినులకు ఈ పథకాన్ని విస్తరించే అవకాశాలపై కూడా పరిశీలన కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

అర్హులైన విద్యార్థినులు అధికారిక పోర్టల్ indigoreachgwf.scholarsbox.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తుకు ముందు అర్హతలు, అవసరమైన పత్రాలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us