GHMC: జీహెచ్ఎంసీలో మరోసారి పొలిటికల్ హీట్.. బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందడి షురూ..
బల్దియాలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందడి మొదలైంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల దక్కని కార్పొరేటర్లు.. కనీసం స్టాండింగ్ కమిటీలోనైనా చోటు దక్కించుకునేందుకు కసరత్తులు స్టార్ట్ చేశారు.
GHMC Standing Committee: బల్దియాలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందడి మొదలైంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల దక్కని కార్పొరేటర్లు.. కనీసం స్టాండింగ్ కమిటీలోనైనా చోటు దక్కించుకునేందుకు కసరత్తులు స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ను బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ విడుదల చేశారు. ఈ నెల 20న జరిగే ఎన్నికల్లో స్టాండ్ అవ్వాలని గ్రేటర్ లో ప్రాతినిధ్యం ఉన్న మూడు ప్రధాన పార్టీల కార్పొరేటర్లు పావులు కదుపుతున్నారు.
రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కడం ఎంత ముఖ్యమో.. ఆ మెట్టులోని పదవిని చేతపట్టడం అంతే ఇంపార్టెంట్. గ్రేటర్ హైదరాబాద్‌లో కార్పొరేటర్‌గా గెలవడం.. ఆ తర్వాత మేయర్ లేదా డిప్యూటీ మేయర్ కావాలనుకోవడం కామన్. కానీ, అందరికీ ఆ ఛాన్స్ రాదుగా. మరీ ఈ రెండు కుదరకపోతే ఉన్న నెక్స్ట్ ఆప్షనే స్టాండింగ్ కమిటీ మెంబర్. మిగిలిన కార్పొరేటర్ల తాపత్రయం అంతా దానిపైనే ఉంటుంది. గ్రేటర్ ఎన్నికలు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక 8 నెలల కిందటే జరిగిపోయాయి. అయినా ఇంతవరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగలేదు. మొత్తానికి లేటుగానయినా స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నగారా మోగింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో 150 డివిజన్లకు కొత్త కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకుంది. అయితే మేయర్ పదవి మహిళలకు రిజర్వేషన్ ఉండగా.. డిప్యూటీ మేయర్ జనరల్‌కు అవకాశం ఉన్నా మహిళకే కట్టబెట్టారు. దీంతో చాలా మంది సీనియర్ కార్పొరేటర్లు ఫీల్ అయ్యారు. అయిందేదో అయిపోయింది కనీసం స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా నయినా అవకాశం ఇస్తే బాగుండని వారు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. దీంతో ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకుని అధిష్టానం దృష్టిలో పడేందుకు కార్పొరేటర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నవంబర్ 20న స్టాండింగ్ కమిటీకి ఎన్నిక జరగనుంది. ఆ రోజే కౌంటింగ్ కూడా చేయనున్నారు.
బల్దియాలో అభివృద్ధి కోసం ఏ నిర్ణయం జరగాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందాలి. ఒక రకంగా స్టాండింగ్ కమిటీ మెంబర్ అంటే కీలక నిర్ణయాల్లో భాగస్వాములయ్యే అవకాశం అన్నమాట. మున్సిపల్ చట్టం ప్రకారం 10 మంది కార్పొరేటర్లకు ఒక స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉంటారు. ఈ లెక్కన 150 మంది కార్పొరేటర్లకు 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నిక అవుతారు. ప్రస్తుతం సభలో 56 మంది టీఆర్ఎస్, 47 మంది బీజేపీ, 44 మంది ఎంఐఎం సభ్యులు ఉన్నారు. అంటే 5 లేదా ఆరుగురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీలో దక్కించుకోనున్నారు. బీజేపీకి నాలుగు, ఎంఐఎంకు నలుగురికి స్టాండింగ్ కమిటీలో స్థానాలు దక్కనున్నాయి.
ఇదిలావుంటే, గ్రేటర్ బీజేపీలో వింత పరిస్థితి నెలకొంది. బల్దియా సమావేశాల్లో బీజేపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించే ఫ్లోర్ లీడర్ ఎంపికే ఇంతవరకు జరగలేదు. బీజేపీ కార్పోరేటర్లు ఫ్లోర్ లీడర్ పదవి కోసం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చుట్టు చక్కర్లు కొడుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ముగియడంతో ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటారేమోనని ఆశిస్తున్నారు. ఈ రేసులో ముగ్గురు బీజేపీ కార్పోరేటర్ల పేర్లు వినిపిస్తున్నాయి. చంపాపేట్ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి పేర్లు బలంగా వినపడుతున్నాయి. మరీ స్టాండింగ్ కమిటీలో బీజేపీ నుంచి నలుగురి ఛాన్స్ ఉండటంతో వాటితో పాటు ఫ్లోర్ లీడర్ ఎంపిక కూడా పూర్తవుందని భావిస్తున్నారు బీజేపీ కార్పొరేటర్లు.
ఇక, గతంలో గ్రేటర్ కౌన్సిల్ లో టీఆర్ఎస్, ఎంఐఎంలకు మాత్రమే స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉన్నారు. అప్పుడు ప్రతి సభ్యునికీ ఏడాది కాలం అవకాశం ఇచ్చి ఆ తర్వాత కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా అవకాశం కోసం టీఆర్ఎస్ నుంచి ఇప్పటికే చాలా మంది సీనియర్ కార్పొరేటర్లు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్టాండింగ్ కమిటీలో చివరకు స్టాండ్ అయ్యేదెవరో 20వ తేదీ వరకు వేచి చూడాలి.