Hyderabad: ఆ షాపులోని చాక్లెట్ల కోసం పిల్లల ఆరాటం.. పోలీసుల తనిఖీల్లో దిమ్మతిరిగిపోయే నిజం
రంగారెడ్డి జిల్లా నందిగామలో గంజాయి కలిపిన చాక్లెట్లను విక్రయిస్తున్న ముఠా ఎక్సైజ్ పోలీసులకు చిక్కింది. బీహార్‌కు చెందిన పింటూ సింగ్‌ను అరెస్ట్ చేసిన అధికారులు, 11 కిలోలకుపైగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మత్తు వ్యసనానికి యువతను ఆకర్షించేందుకు ఈ తరహా కుట్ర చేసినట్టు పోలీసులు గుర్తించారు. ముఠా నెట్‌వర్క్‌పై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.

రంగారెడ్డి జిల్లాలో గంజాయి కలిపిన చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. షాద్‌నగర్ ఎక్సైజ్ & ప్రొహిబిషన్ విభాగం స్పెషల్ టీమ్ బీహార్ రాష్ట్రం నుంచి ఈ చాక్లెట్లను తెప్పించి నందిగామ ప్రాంతంలో విక్రయిస్తున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేసింది.
రహస్య సమాచారం ఆధారంగా నందిగామలోని ఒక షాపుపై దాడి నిర్వహించిన అధికారులు.. దాదాపు 11.130 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 3.50 లక్షలు ఉంటుందని అంచనా. వీటిని ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి.. సాధారణ తినుబండారాల్లా అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో పిల్లలు, యువత ఈ గంజాయి చాక్లెట్ల కోసం వెంపర్లాడుతున్నారని.. వారిని ఈ మత్తుకు బానిస చేసేందుకు ముఠా ప్రయత్నించిందని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో బీహార్ రాష్ట్రానికి చెందిన పింటూ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు నేరుగా చాక్లెట్లు విక్రయిస్తున్న సమయంలోనే ఎక్సైజ్ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మాములు గంజాయి రవాణా, అమ్మకం కష్టతరంగా మారడంతో.. ఈజీగా, ఇబ్బంది లేకుండా లాభాలు గడించాలనే ఆలోచనతో అతను ఈ చర్యలకు పాల్పడ్డట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ప్రస్తుతం పింటూ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు, అతడి నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను కొత్త రూపాల్లో మార్కెట్‌కి తెచ్చే ప్రయత్నాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..