Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్.. పూర్తి వివరాలు
సింగూరు ఫేజ్ - 3కి సంబంధించి ఇక్రిశాట్ వద్ద 1200 ఎంఎం డయా పీఎస్‌సీ గ్రావిటీ మెయిన్‌కు మరమ్మత్తులు జరపాల్సి ఉంది. రానున్న 24 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం..

హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ, జలమండలి కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ప్రకటన విడుదల చేసింది.హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్ – 3కి సంబంధించి ఇక్రిశాట్ వద్ద 1200 ఎంఎం డయా పీఎస్‌సీ గ్రావిటీ మెయిన్‌కు మరమ్మత్తులు జరపాల్సి ఉంది. నీటి లీకేజీలు అరికట్టడానికి గానూ ఈ పనులు చేపట్టడం జరుగుతోంది. రానున్న 24 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు జలమండలి అధికారులు తెలియజేశారు. జలమండలి డివిజన్ల 9, 15, 24 పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని.. సహకరించాలని కోరింది.
24 గంటల పాటు అంతరాయం
జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని డివిజన్లకు నవంబర్ నెల రెండవ తేదీన అంటే 02.11.2022, బుధవారం ఉదయం 6 గంటల నుంచి 03.11.2022 గురువారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 24 గంటల వరకు సింగూరు ఫేజ్ – 3 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.
తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్న ప్రాంతాలు ఇవే..
నీటి సరఫరాకు అంతరాయం కలగనున్న ప్రాంతాలు జలమండలి డివిజన్ 9, 15, 24 డివిజన్ల పరిధిలోని బీహెచ్ఈఎల్ ఎంఐజీ, బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ, చందానగర్, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, నల్లగండ్ల, హుడా కాలనీ, గోపన్‌పల్లి, లింగంపల్లి, గుల్‌మహర్ పార్కు, నెహ్రు నగర్, గోపినగర్, దూబే కాలనీల్లో 24 గంటల పాటు నీటి సరఫరా ఉండదు. గోపాల్ నగర్, మయూరి నగర్, మాదాపూర్, ఎస్ఎంఆర్, గోకుల్ ప్లాట్స్, మలేషియా టౌన్‌షిప్, బోరబండ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో లోప్రెషర్‌తో నీటి జరఫరా జరుగుతుంది.
కావున, నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి కోరింది. మరమ్మతు పనులు అయిన వెంటనే తాగు నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని వెల్లడించింది.
మరిన్ని హైదరాబాద్ న్యూస్ కోసం..
