Hyderabad: హలో.. నేను అనన్య కులకర్ణి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు సాఫ్ట్‌గా లైన్ కలిపింది.. కట్ చేస్తే..
హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పార్ట్‌టైమ్ జాబ్, ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.25.85 లక్షలు మోసం చేశారు. మొదట చిన్న మొత్తాన్ని చెల్లించి నమ్మకం కల్పించిన నేరగాళ్లు, తర్వాత నకిలీ ట్రేడింగ్ యాప్‌లో భారీ లాభాలు చూపించి డబ్బులు పెట్టించారు. విత్‌డ్రా సమయంలో అదనపు ఛార్జీలు కోరడంతో మోసం బయటపడగా, బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

హలో.. నేను అనన్య కులకర్ణి మాట్లాడుతున్నా.. కొంచెం టైం ఇస్తే లక్షల్లో లాభాలు వచ్చే మార్గం చెబుతా అంటూ.. ఫోన్ చేసింది.. ఇదేదో మంచి ఆఫర్ అనుకుంటూ మనోడు కూడా మాటలు కలిపాడు.. ఆ తర్వాత.. ప్రొఫెసర్ గుల్ టెక్‌చందినిని లైన్ లో తీసుకుంటున్నా.. మీకు మైక్రో స్టాక్ మార్కెట్.. అధిక లాభాల గురించి చెబుతారు అంటూ.. ఇద్దరూ మాట్లాడారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.. ఇలా అతన్ని నమ్మించి నిండా ముంచారు.. కొండాపూర్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (40) భారీ మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నాడు.. డిజిటల్ అరెస్ట్, ఆన్‌లైన్ పార్ట్ టైమ్ జాబ్, పెట్టుబడులు ఇలాంటివి నమ్మోద్దు.. అంటూ పదే పదే చెబుతున్నప్పటికీ.. కొందరు వాటి ఉచ్చులో పడి పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా.. హైదరాబాద్ ఐటీ హబ్ సైబరాబాద్ పరిధిలో మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. . పార్ట్ టైమ్ జాబ్స్, ట్రేడింగ్ పెట్టుబడుల్లో భారీ మొత్తం లాభాలు.. అంటూ ఎర వేసిన సైబర్ నేరగాళ్లు.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి పెద్ద మొత్తంలో దండుకున్నారు. సైబర్ క్రిమినల్స్ వలలో పడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దాదాపు రూ. 26 లక్షల వరకు పోగొట్టుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి మొదట వాట్సాప్/టెలిగ్రామ్ ద్వారా పార్ట్ టైమ్ వర్క్, ఆన్‌లైన్ టాస్క్‌ల ద్వారా ఇంట్లోనే కూర్చుని సులభంగా డబ్బు సంపాదించవచ్చంటూ మెసేజ్ వచ్చింది. ప్రారంభంలో కొన్ని చిన్న చిన్న టాస్క్‌లు పూర్తి చేసినందుకు కొంత డబ్బును క్రిడిట్ చేసి నమ్మకం కలిగించారు. బాధితుడు మొదట రూ. 20,000 పెట్టుబడి పెట్టాడు. అతని నమ్మకాన్ని పెంచడానికి, రూ. 3,000 ఉపసంహరించుకోవడానికి అతనికి అనుమతి ఇచ్చారు.
ఆ తర్వాత, మరింత ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశ చూపి ఒక నకిలీ ట్రెడింగ్ వెబ్‌సైట్ యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలని ప్రోత్సహించారు. క్రిప్టో ట్రేడింగ్ లేదా టాస్క్ రివార్డుల పేరుతో పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేయించారు. బాధితుడు దఫదఫాలుగా తన సొంత డబ్బుతో పాటు ఆన్‌లైన్ లోన్లు తీసుకుని మొత్తం రూ. 25.85 లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. దాని ఆ నకిలీ ట్రేడింగ్ యాప్ రూ. 1.17 కోట్ల వర్చువల్ లాభాలను కూడా చూపించిందని బాధితుడు తెలిపాడు.
వెలుగులోకి వచ్చిన మోసం:
తన వాలెట్‌లో వర్చువల్‌గా లాభాలు భారీగా కనిపిస్తున్నప్పటికీ, ఆ డబ్బును తన సొంత బ్యాంకు ఖాతాకు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నేరగాళ్లు అసలు రంగు బయటపెట్టారు. డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే అదనంగా పన్నులు (TDS), ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో మరిన్ని లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు దర్యాప్తు:
బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేరగాళ్లు ఉపయోగించిన టెలిగ్రామ్ ఖాతాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.
ఆన్‌లైన్‌లో తెలియని వ్యక్తులు పంపే పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్లు, లైక్‌లు కొడితే డబ్బులు ఇస్తామనే ప్రకటనలు, అధిక వడ్డీలు, లాభాలు ఇస్తామని చెప్పే ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లను అస్సలు నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు పౌరులను కోరారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
