జీడిమెట్ల, నవంబర్ 27: హైదరాబాద్ మహా నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యత కొరవడింది. బిర్యానీలో బొద్దింక, బల్లి దర్శనమిచ్చాయంటూ ఈ మధ్య తరచూ వార్తల్లో చూస్తున్నాం. మొన్నటికి మొన్న బావర్చిలో కస్టమర్ బిర్యానీ తింటుండగా.. సిగరెట్ పీక కనిపించిన సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ ఫోకస్ చేసింది. ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పాతబస్తీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. సోమవారం కోఠిలోని మోతీ మార్కెట్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చికెన్ తింటున్న ఎలుకలను చూసి సాక్షాత్తు మేయర్ అవాక్కయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు మార్కెట్‌ను సీజ్ చేయించారు.
అయితే.. ఇప్పుడు ఈ తనిఖీలే పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయి. ఇది కాస్తా ఒక్కసారిగా మజ్లీస్ ఎమ్మెల్సీ వర్సెస్ జీహెచ్‌ఎంసీ మేయర్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీనికి కారణం ఏంటంటే.. సీజ్ చేసిన మోతీ మార్కెట్ ఎంఐఎం ఎమ్మెల్సీ రహమత్ బేగ్ చొరవతో తిరిగి తెరుచుకోవడమే. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళాలు పగలగొట్టి మరీ సీజ్ చేసిన మార్కెట్ తెరవడంపై మేయర్ సీరియస్ అయ్యారు.
మోతీ మార్కెట్ తాళాలు తీయకుంటే.. ఉద్యోగాలు పోతాయంటూ సేఫ్టీ అధికారులను ఎంఐఎం నేతలు బెదిరించడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజ్ చేసిన మాంసాన్ని సైతం లాక్కొని, నోటీసులు సైతం చింపి వేయడంపై మేయర్ తీవ్రంగా మండిపడినట్లు సమాచారం. అదీ కాక మరోసారి తమ దుకాణాలపై దాడులు చేస్తే చర్యలు తప్పవంటూ ఎమ్మెల్సీ హెచ్చరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మేయర్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్సీ బేగ్ పై కాచిగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.