AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగునీటి కొరత ఉండొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని.. తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగునీటి కొరత ఉండొద్దు: సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy
Sravan Kumar B
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 30, 2024 | 9:37 PM

Share

రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని.. తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. డిమాండ్‌కు సరిపడేంత విద్యుత్తు అందుబాటులో ఉందని, కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. గత ఏడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్తును సరఫరా చేయటం కొత్త రికార్డును నమోదు చేసిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని, పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోత లేకుండా విద్యుత్తును అందించటంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. గత ఏడాదితో పోలిస్తే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు సరఫరా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సగటున 9712 మెగావాట్ల విద్యుత్తు లోడ్ ఉంటుంది. గత రెండు వారాలుగా 14000 మెగా వాట్ల నుంచి 15000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటోంది. ఏప్రిల్ నెల రెండోవారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని విద్యుత్తు అధికారులు అంచనా వేశారు.

వేసవి అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు సరఫరా చేసే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పారు. గత ఏడాది(2023) జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అయింది. 2024 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో రోజుకు సగటున 251.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా జరిగింది. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్లు సరఫరా అత్యధిక రికార్డు కాగా.. ఈ ఏడాది 308.54 మిలియన్ యూనిట్లతో కొత్త రికార్డు నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ గత ఏడాదితో పోలిస్తే విద్యుత్తు సరఫరా మెరుగుపడింది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బోర్ వెల్స్, బావులన్నింటినీ తాగునీటి అవసరాలకు వాడుకోవాలని, సమీపంలో ఉన్న నీటి వనరులన్నింటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సమస్య ఉన్న చోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు. వేసవి కోసం ప్రత్యేకంగా గ్రామాల వారీగా డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని చెప్పారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర స్థాయి నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలలో తాగునీటి కొరతను అధిగమించేందుకు వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యం లేకుండా 12 గంటల్లోపు అవసరమైన చోటికి చేరేలా చూడాలని, అందుకు సరిపడేన్ని ట్యాంకర్లు సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.