Hyderabad: హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీందర్, మహేశ్ భగవత్‌లో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలపై కేసీఆర్ సమీక్షించారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలని, ఎవరికీ ఎలాంటి సమస్యలు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని.. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.
కాగా పాతబస్తీలో పరిస్థితుల గురించి పోలీసు అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు కేసీఆర్. అలాగే రాజాసింగ్ వ్యాఖ్యలపైనా స్పందించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు వారి మతాలు, కులాలు, ఆచారాలకు అనుగుణంగా జీవించే హక్కు ఉంది. ఇతరుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతినే విధంగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజాసింగ్‌పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..