Hyderabad: మటన్ తో పోటీ పడుతోన్న చికెన్.. రేటు ఎంతో తెలిస్తే ముద్ద దిగడమూ కష్టమే
చికెన్ ప్రియులకు ఇది చేదువార్త. రోజురోజుకు మాంసం ధరలు పెరిగిపోతున్నాయి. వారం రోజుల క్రితం 200 నుంచి 250 రూపాయలు ఉన్న కేజీ చికెన్(Chicken Prices in Hyderabad) ధర ప్రస్తుతం రూ.300కు చేరాయి. వారం రోజుల్లోనే...
చికెన్ ప్రియులకు ఇది చేదువార్త. రోజురోజుకు మాంసం ధరలు పెరిగిపోతున్నాయి. వారం రోజుల క్రితం 200 నుంచి 250 రూపాయలు ఉన్న కేజీ చికెన్(Chicken Prices in Hyderabad) ధర ప్రస్తుతం రూ.300కు చేరాయి. వారం రోజుల్లోనే చికెన్ ధర కేజీకి రూ. 50 వరకు వినియోగదారులకు అందనంత ఎత్తుకు పెరిగిపోయింది. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు చికెన్ ముక్క తినడం కూడా భాగ్యమైపోతోంది. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండటం, పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడాలు ఉండటంతో వేడికి తాళలేక కోళ్లు చనిపోతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో కేజీ మాంసం కొనుగోలు చేసేవారు అరకేజీతో సరిపెట్టుకుంటున్నారు. ధరలు పెరగడంతో పెంపకం దారులు కోడి బరువు తక్కువగా ఉండగానే అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కేజీన్నర బరువున్న వాటిని కూడా అమ్ముతున్నారు. సాధారణంగా వేసవిలో ఎండవేడికి కోళ్లు ఎక్కువగా చనిపోతుంటాయి. అందువల్ల వీలైనంత వరకు వేసవికి ముందే పెంపకందారులు అమ్మకాలు చేస్తుంటారు. దీంతో ప్రస్తుతం చిన్న రైతుల వద్ద కోళ్లు అయిపోయాయి.
ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతాయి. సాధారణంగా రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. ఎండాకాలంలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. కోడి ధర పెరిగినా తాము నష్టాలు ఎదుర్కొంటున్నామని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబీన్ ధర నెల రోజుల్లో కిలోకు ఏకంగా రూ. 35 నుంచి రూ.90కి పెరిగింది. మొక్కజొన్న కిలో రూ. 12 నుంచి రూ. 24కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో డిమాండ్‌కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్ ధర పెరిగింది. మార్కెట్ లోకి కొత్త జాతులు, దాణాల రేట్లు తగ్గితే గానీ చికెన్ రేట్లు తగ్గే పరిస్థితి కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి