Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త.. నేటి నుంచి షురూ.. దరఖాస్తు చేస్కోండి..
ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలోని పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ బ్రోచర్‌ను విడుదల చేయనున్నారు. నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున తొలి విడతలో నిర్మించనున్నారు. దీంతో హైదరాబాద్‌లోని పేదలకు ఊరట కలగనుంది.

హైదరాబాద్ ప్రజలకు తీపికబురు అందింది. ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో దీనికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇళ్ల నిర్మాణంపై మార్గదర్శకాలు, అర్హతలు, విధివిధానాలతో కూడిన ప్రత్యేక బ్రోచర్‌ను రిలీజ్ చేయనున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌తో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌లు దీనిని విడుదల చేయనున్నారు. ఈ బ్రోచర్‌లో అర్హతలు, మార్గదర్శకాలు వంటివి ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని పేదలకు ఇళ్లను ఈ విడతలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఒక్కొ నియోజకవర్గంలో 500 ఇళ్లు
తొలి విడతలో భాగంగా హైదరాబాద్‌లోని 26 నియోజకవర్గాల్లో ఒక్కొ నియోజకవర్గంలో 500 ఇళ్ల చొప్పున నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నగరంలో వీటి నిర్మాణానికి స్థలాలను అధికారులు సేకరించారు. స్థల సేకరణ పూర్తవ్వడంతో ఇప్పుడు ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ విడతలో గరిష్టంగా 10 అంతస్తుల వరకు టవర్లను నిర్మించనున్నారు. లక్ష ఇళ్లను నిర్మించి నగరంలోని పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణం కోసం ఎల్బీ నగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నాంపల్లి, పటాన్ చెర్వు వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను సేకరించారు. త్వరలోనే ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టనుండగా.. త్వరతగతిన పూర్తి చేసి పేదలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. నియోజకవర్గాల వారీగా పెద్ద అంతస్తుల భవనాలు నిర్మిస్తారు.
2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి సిద్దం
ఎకరం నుంచి 5 ఎకరాల వరకు విస్తీర్ణం కలిగిన విలువైన స్థలాలను ప్రభుత్వం సేకరించింది. గరిష్టంగా 10 అంతస్తుల వరకు బహుళ అంతస్తుల సముదాయాలను నిర్మిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సొంత నియోజకవర్గంలో అర్హులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 3.68 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వీటిల్లో 2 లక్షలకుపైగా ఇళ్లు పూర్తయ్యాయి. ఈ ఆర్ధిక సంవత్సరంలో 2.50 లక్షల ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమవ్వగా.. అదనంగా హైదరాబాద్ పరిధిలో నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లను కేటాయించనుంది. అలాగే నగరంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
