రాజేంద్రనగర్‌లో యువకుడి దారుణ హత్య.. డ్రగ్స్ లీక్ అనుమానమే ప్రాణం తీసిందా?
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ డీసీపీ జోన్‌లో వసీం అనే యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌లో స్నేహితుల కత్తుల దాడిలో వసీం ప్రాణాలు కోల్పోయాడు. డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధించిన సమాచారం లీక్ చేస్తున్నాడనే అనుమానంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితులపై గతంలో NDPS కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ డీసీపీ జోన్‌లో మరో దారుణ హత్య కలకలం రేపింది. ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌లో నివాసముండే వసీం అనే యువకుడు తనకు తెలిసిన వారే కత్తులతో దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుల మధ్య మొదలైన వాగ్వాదం చివరకు హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అసలు గొడవ ఎక్కడ మొదలైంది?
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. వసీంకు, అతనితో పరిచయం ఉన్న కొందరు యువకులకు గతంలో డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధించిన పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. వసీంతో పాటు నిందితులపై గతంలో NDPS కేసులు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. అయితే.. డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని బయటకు లీక్ చేస్తున్నాడనే అనుమానం వసీంపై అతని స్నేహితులకు అనుమానం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇదే అనుమానం క్రమంగా కక్షగా మారిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాటామాటా పెరిగి.. కత్తులతో దాడి
ఈ క్రమంలో వసీం, అతని స్నేహితుల మధ్య వాగ్వాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. మాటలతో మొదలైన గొడవ ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చింది. ఇద్దరు వ్యక్తులు కలిసి వసీంపై కత్తులతో దాడి చేసినట్లు పోలీసులకు ప్రత్యక్ష సాక్షులు ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలతో వసీం అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు, నిందితుల పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ హత్య వెనుక అసలు కారణం మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.
రాజేంద్రనగర్ జోన్‌లో వరుస ఘటనలు.. ఎందుకు?
ఇదిలా ఉండగా.. రాజేంద్రనగర్ డీసీపీ జోన్ పరిధిలో వరుసగా హత్యలు, హత్యాయత్నాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా యువకుల మధ్య గొడవలు, పాత కక్షలు, డ్రగ్స్ వ్యవహారాలు వంటి అంశాలు నేరాలకు దారితీస్తున్నాయా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
తాజాగా వసీం హత్యలోనూ డ్రగ్స్ వ్యవహారంపై ఏర్పడిన అనుమానమే ప్రధాన కారణమా? లేక దీని వెనుక మరేదైనా పాత వివాదం ఉందా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
