AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

400 యుద్ధనౌకలతో చైనా దూకుడు.. సముద్రాలపై డ్రాగన్ పట్టు.. అమెరికాకు కొత్త సవాల్!

అమెరికాకు చైనా మరో రూపంలో గట్టి సవాల్ విసురుతోంది. ఇప్పటివరకు ఆర్థిక, సాంకేతిక, వాణిజ్య రంగాల్లో పోటీపడిన ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు సముద్రాలపై ఆధిపత్యం కోసం పోటీ మరింత తీవ్రమవుతోంది. చైనా తన నౌకాదళాన్ని అనూహ్య వేగంతో విస్తరిస్తోంది. వందల సంఖ్యలో యుద్ధనౌకలు, జలాంతర్గాములను సిద్ధం చేస్తూ సముద్ర జలాల్లో తన పట్టును పెంచుకుంటోంది. ఇప్పటికే నౌకల సంఖ్యలో అమెరికాను దాటేసిన డ్రాగన్.. భవిష్యత్తులో మరింత పెద్ద సైనిక శక్తిగా ఎదిగేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ పరిణామాలు అమెరికా రక్షణ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

400 యుద్ధనౌకలతో చైనా దూకుడు.. సముద్రాలపై డ్రాగన్ పట్టు.. అమెరికాకు కొత్త సవాల్!
Us On Alert As China Expands Naval Fleet And Strengthens Sea Power
Sharada V
|

Updated on: Nov 08, 2026 | 9:12 AM

Share

చైనా నౌకాదళంలో ప్రస్తుతం 400కు పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఉన్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనం ప్రచురించింది.చైనా తన నౌకాదళాన్ని ఈ స్థాయిలో విస్తరించడం ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద పరిణామాల్లో ఒకటిగా అభివర్ణించింది.

ప్రస్తుతం చైనా వద్ద మూడు విమాన వాహక నౌకలు ఉన్నాయి. మరో భారీ విమాన వాహక నౌక నిర్మాణంలో ఉంది. నాలుగో విమాన వాహక నౌక అణుశక్తితో పనిచేసే అవకాశం ఉందని పాశ్చాత్య దేశాల రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతేకాదు.. చైనా యుద్ధనౌకలు ఇప్పుడు తమ దేశ తీర ప్రాంతాలకే పరిమితం కావడం లేదు. దక్షిణ చైనా సముద్రం నుంచి జపాన్, తైవాన్ సమీప జలాల వరకు విస్తృతంగా సంచరిస్తున్నాయి. ఆసియాలోని కీలక సముద్ర మార్గాల్లో ప్రతిరోజూ సుమారు 100 చైనా నౌకాదళ నౌకలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

తైవాన్ చుట్టూ నిరంతర నిఘా

చైనా నౌకాదళం తైవాన్ చుట్టుపక్కల ప్రాంతాలపై దృష్టి పెట్టింది. తైవాన్ చుట్టూ ఏ సమయంలో చూసినా సుమారు ఆరు చైనా నౌకాదళ నౌకలు ఉంటున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో ఈ నౌకల ఉనికి మరింత ఎక్కువగా ఉంటోంది. తైవాన్ చుట్టుపక్కల ప్రాంతంతో పోలిస్తే అక్కడ దాదాపు మూడు రెట్లు ఎక్కువ చైనా నౌకలు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని కొన్ని దీవులు, సముద్ర జలాలపై చైనాకు ఫిలిప్పీన్స్, వియత్నాంతో చాలా కాలంగా వివాదాలు ఉన్నాయి.

చైనా వ్యూహం కేవలం యుద్ధనౌకల సంఖ్య పెంచుకోవడానికే పరిమితం కాలేదు. తన తీర ప్రాంతాల చుట్టూ సముద్రాలపై పూర్తి పట్టు సాధించడం, వివాదాస్పద ప్రాంతాలపై హక్కులను బలపరచుకోవడం, భవిష్యత్తులో యుద్ధం వస్తే అమెరికా సైన్యం జోక్యం చేసుకోకుండా అడ్డుకోవడం లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.

చైనాకు భారీ షిప్‌యార్డుల బలం!

చైనా ఇంత వేగంగా నౌకాదళాన్ని విస్తరించడానికి ప్రధాన కారణం ఆ దేశంలోని భారీ నౌకా నిర్మాణ పరిశ్రమ. ప్రపంచంలోనే అతిపెద్ద షిప్‌ బిల్డింగ్ దేశంగా చైనాకు గుర్తింపు ఉంది. ప్రపంచ వాణిజ్య నౌకల్లో సగానికి పైగా అక్కడే తయారవుతున్నాయి. భారీ కంటైనర్ నౌకలు, సహజ వాయువును రవాణా చేసే నౌకలు ఇలా ఎన్నో రకాల నౌకలను చైనా షిప్‌యార్డులు నిర్మిస్తున్నాయి.

ఇప్పుడు ఇదే సామర్థ్యాన్ని యుద్ధనౌకల తయారీకి ఉపయోగిస్తోంది. ఒకవైపు వాణిజ్య నౌకలను నిర్మిస్తూనే మరోవైపు అత్యాధునిక యుద్ధనౌకలను వేగంగా తయారు చేస్తోంది.

2013లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలానికే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ దేశాన్ని ఒక ‘సముద్ర మహాశక్తి’గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రపంచ చరిత్రలో సముద్ర మార్గాలపై ఆధిపత్యం సాధించిన పాశ్చాత్య దేశాలు వాణిజ్యం, వలస పాలన, అంతర్జాతీయ ప్రభావాన్ని ఎలా పెంచుకున్నాయో ప్రస్తావించారు.

ఒక్క ఏడాదిలో 19 యుద్ధనౌకలు!

చైనా నౌకాదళ విస్తరణ వేగం ఎంత ఎక్కువగా ఉందో గణాంకాలు చెబుతున్నాయి. 2020 నుంచి ఇప్పటివరకు చైనా 71 భారీ యుద్ధనౌకలు, జలాంతర్గాములను తన నౌకాదళంలో చేర్చుకుంది. వీటిలో ఒక్క గత ఏడాదిలోనే 19 నౌకలు ఉన్నాయి. నౌకల సంఖ్యలో చైనా ముందున్నప్పటికీ నౌకల మొత్తం బరువు (Fleet Tonnage) విషయంలో అమెరికా ఇప్పటికీ ఆధిక్యంలోనే ఉంది. అమెరికా వద్ద ఉన్న యుద్ధనౌకలు పెద్ద పరిమాణంలో ఉంటాయి. చైనా భారీ యుద్ధనౌకలను నిర్మిస్తూ ఈ అంతరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది.

ఒకే ద్వీపంలో నిర్మాణం.. ఉపగ్రహ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు!

చైనా నౌకాదళ విస్తరణకు షాంఘై సమీపంలోని చాంగ్‌షింగ్ ద్వీపం ప్రధాన కేంద్రం. ఇక్కడి రెండు భారీ షిప్‌యార్డుల్లో వాణిజ్య నౌకలు, సైన్యం కోసం అత్యాధునిక యుద్ధనౌకలను నిర్మిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు నిర్మాణ కార్యకలాపాల స్థాయిని బయటపెట్టాయి.

ఐదేళ్ల క్రితం వరకు ఈ ప్రాంతంలో ఖాళీ స్థలాలే ఉండేవి. ఇప్పుడు అదే ప్రాంతం భారీ యుద్ధనౌకల తయారీ కేంద్రంగా మారిపోయింది. 2023లో 40 వేల టన్నుల బరువున్న ‘సిచువాన్’ భారీ నౌక నిర్మాణం ప్రారంభమైంది. దీనిని డ్రోన్ క్యారియర్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర దాడి నౌకల్లో ఇది ఒకటి. దీని పరిమాణం, సామర్థ్యం నౌకాదళ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఈ ఏడాది జూన్‌లో ఇదే ద్వీపంలోని షిప్‌యార్డ్‌లో కొత్త తరహా జలాంతర్గామి కనిపించింది. ఇది అణుశక్తితో పనిచేసే జలాంతర్గామి అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాముల నుంచి అణుశక్తితో పనిచేసే అధునాతన జలాంతర్గాముల వైపు చైనా అడుగులు వేస్తోంది.

 భారత్‌కూ కీలక పరిణామమే!

2040 నాటికి చైనా జలాంతర్గాములు హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ ప్రాంతాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి చేరుకోవచ్చు. అవసరమైతే అట్లాంటిక్ మహాసముద్రం వరకు కూడా వెళ్లే సామర్థ్యాన్ని సాధించవచ్చని భావిస్తున్నారు.

హిందూ మహాసముద్రం భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన అనేక ముఖ్యమైన సముద్ర మార్గాలు ఈ ప్రాంతం గుండా వెళ్తాయి. ఇక్కడ చైనా నౌకాదళ కార్యకలాపాలు పెరిగితే ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాల పర్యవేక్షణ విషయంలో కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.

సముద్రాలపై పట్టు కోసం అమెరికా, చైనా మధ్య ఆధిపత్య పోరు!

యెల్లో సీ నుంచి తూర్పు, దక్షిణ చైనా సముద్రాల వరకు విస్తరించిన ప్రాంతం ఇప్పుడు అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీకి కేంద్రంగా మారింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య సముద్ర మార్గాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ జలాలపై పట్టు సాధించడం ద్వారా తన సైనిక, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలని చైనా భావిస్తోంది.

మరోవైపు జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు అమెరికాకు కీలక మిత్రదేశాలు. ఇవన్నీ కలిసి అమెరికా సైనిక వ్యూహంలో ‘ఫస్ట్ ఐలాండ్ చైన్’గా పిలిచే ప్రాంతంలో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెరగకుండా అడ్డుకోవడం అమెరికా రక్షణ వ్యూహంలో అత్యంత కీలకం.

ఇప్పటికే చైనా భారీ సంఖ్యలో యుద్ధనౌకలను సముద్రాల్లో మోహరిస్తుండగా.. అమెరికా కూడా తన మిత్రదేశాలతో కలిసి ఈ ప్రాంతంపై నిఘా పెంచుతోంది. చైనా నౌకాదళ బలం పెరిగితే వివాదాస్పద సముద్ర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించడం, పొరుగు దేశాలపై ఒత్తిడి తీసుకురావడం, భవిష్యత్తులో ఎదురయ్యే సైనిక ఘర్షణలకు సిద్ధం కావడం మరింత సులభమవుతుంది. సముద్రాలపై ఆధిపత్యం కోసం సాగుతున్న అమెరికా, చైనా పోటీ రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చూడండి

Follow Us