AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రవీంద్రనాథ్ టాగోర్‌‌కు ఘోర అవమానం.. చిత్రపటానికి నల్లరంగు పూసి, ధ్వంసం చేసిన దుండగులు!

బంగ్లాదేశ్‌లో విశ్వ కవి, నోబెల్‌ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ టాగోర్‌ చిత్రపటాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. ఖుల్నా రైల్వే స్టేషన్‌ ప్రహరీ గోడపై ఉన్న టాగోర్‌ కుడ్యచిత్రంపై నల్లటి సిరా పూసి వికృతం చేశారు. అంతేకాకుండా ఆయనకు, భారత్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను చిత్రపటం పక్కన అతికించారు. నవంబర్‌ 6న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రవీంద్రనాథ్ టాగోర్‌‌కు ఘోర అవమానం.. చిత్రపటానికి నల్లరంగు పూసి,  ధ్వంసం చేసిన దుండగులు!
Rabindranath Tagore Mural Vandalised
Balaraju Goud
|

Updated on: Nov 07, 2026 | 9:41 PM

Share

ఢాకా: బంగ్లాదేశ్‌లో విశ్వ కవి, నోబెల్‌ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ టాగోర్‌ చిత్రపటాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. ఖుల్నా రైల్వే స్టేషన్‌ ప్రహరీ గోడపై ఉన్న టాగోర్‌ కుడ్యచిత్రంపై నల్లటి సిరా పూసి వికృతం చేశారు. అంతేకాకుండా ఆయనకు, భారత్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను చిత్రపటం పక్కన అతికించారు. నవంబర్‌ 6న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇతర ప్రముఖుల చిత్రాలు జోలికి వెళ్లకుండా..!

ఖుల్నా నగరంలో ప్రధానమంత్రి తారిఖ్‌ రెహమాన్‌ పర్యటన నేపథ్యంలో నగర సుందరీకరణలో భాగంగా ఖుల్నా సిటీ కార్పొరేషన్‌ ఈ కుడ్యచిత్రాలను ఏర్పాటు చేసింది. గోడపై టాగోర్‌తో పాటు ఫకీర్‌ లాలన్‌ షా, చిత్రకారుడు ఎస్‌.ఎం. సుల్తాన్‌, కాజీ నజ్రుల్‌ ఇస్లాం, ఖలేదా జియా, జియావుర్‌ రెహమాన్‌, మైఖేల్‌ మధుసూదన్‌ దత్తా వంటి ప్రముఖుల చిత్రాలను ఏర్పాటు చేశారు. అయితే వీటన్నింటిలో టాగోర్‌ చిత్రపటం మాత్రమే ధ్వంసం కావడం గమనార్హం.

పోస్టర్లలో భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు

టాగోర్‌ చిత్రపటం పక్కన అతికించిన పోస్టర్లలో ఒకదానిపై ఆయన ముస్లింలకు, తూర్పు బెంగాల్‌కు వ్యతిరేకి అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే బంగ్లాదేశ్‌లో భారతదేశాన్ని కీర్తించడానికి చోటు లేదనే సందేశాన్ని కూడా పొందుపరిచారు. ఈ పోస్టర్లపై స్థానిక సాంస్కృతిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాగోర్‌ రచనలు స్వేచ్ఛా ఆలోచన, లౌకికవాదం, మానవ గౌరవానికి ప్రేరణగా నిలిచాయని గుర్తుచేస్తున్నారు.

మళ్లీ చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తామని భరోసా!

ఖుల్నా సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి లోక్‌మాన్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ ఘటనపై సమాచారం అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. సమీపంలోని దుకాణాలు మూసి ఉండటంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారిందన్నారు. మరోవైపు ఖుల్నా సిటీ కార్పొరేషన్‌ నిర్వాహకుడు నజ్రుల్‌ ఇస్లాం మంజు ఈ ఘటనను ఖండించారు. ధ్వంసమైన టాగోర్‌ చిత్రపటాన్ని తిరిగి చిత్రిస్తామని, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు వెల్లడించారు.

ఢాకాలోనూ గతంలో ఇలాంటి ఘటన

గత అక్టోబర్‌ 10న ఢాకాలో కూడా టాగోర్‌ కుడ్యచిత్రాన్ని నల్లటి సిరాతో వికృతం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. తాజాగా ఖుల్నాలోనూ ఇలాంటి ఘటన జరగడం బంగ్లాదేశ్‌లో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై చర్చకు దారితీసింది.

హిందూ మహిళపై దాడి జరిగిందంటూ ప్రచారం..!

ఇదిలా ఉండగా, ఢాకాలో శ్రిమోయీ రీటా రాణి అనే హిందూ మహిళపై దాడి జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే దీనిపై నవంబర్‌ 7న స్పందించిన ఢాకా మెట్రోపాలిటన్‌ పోలీసులు (DMP) మిర్‌పూర్‌ పరిధిలోని ఏడు పోలీస్‌ స్టేషన్లలోనూ ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదని, కేసు నమోదు కాలేదని వెల్లడించారు. బాధితురాలి గుర్తింపు కూడా నిర్ధారించలేదని తెలిపారు. ప్రచారంలో ఉన్న ఫొటో, ఆరోపణల నిజానిజాలపై విచారణ కొనసాగుతోందన్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌కు చెందిన ఫ్యాక్ట్‌చెక్‌ సంస్థ కల్బేలా ఆ ఘటనకు సంబంధించిన ప్రచారం అవాస్తవమని, ఉపయోగించిన ఫొటో AIతో రూపొందించిందని పేర్కొంది.

మొత్తంగా టాగోర్‌ చిత్రపట ధ్వంసం ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న నిర్ధారణ కాని ఆరోపణలపై కూడా పోలీసులు స్పష్టత ఇచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us