AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య కుటుంబాన్నే బలి తీసుకున్న క్యాబ్ డ్రైవర్‌.. ఏడుగురి దారుణ హత్య కేసులో బయటపడ్డ షాకింగ్ నిజం!

కుటుంబ కలహాలు ఏకంగా ఏడు ప్రాణాలను బలిగొన్నాయి. తనను భార్య కుటుంబ సభ్యులు గౌరవించడం లేదన్న కోపంతో.. ఏకంగా భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ఆరుగురిని హతమార్చాడు ఓ క్యాబ్ డ్రైవర్. ఈ దారుణ ఉదంతం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బెంగళూరులో వెలుగుచూసిన ఈ దారుణ ఘటనలో తాజాగా తమిళనాడులోని సేలం జిల్లా ఏర్కాడ్ ఘాట్ అటవీ ప్రాంతంలో భార్య, అత్త మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

భార్య కుటుంబాన్నే బలి తీసుకున్న క్యాబ్ డ్రైవర్‌.. ఏడుగురి దారుణ హత్య కేసులో బయటపడ్డ షాకింగ్ నిజం!
Cab Driver
Balaraju Goud
|

Updated on: Nov 08, 2026 | 9:44 AM

Share

బెంగళూరు: కుటుంబ కలహాలు ఏకంగా ఏడు ప్రాణాలను బలిగొన్నాయి. తనను భార్య కుటుంబ సభ్యులు గౌరవించడం లేదన్న కోపంతో.. ఏకంగా భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ఆరుగురిని హతమార్చాడు ఓ క్యాబ్ డ్రైవర్. ఈ దారుణ ఉదంతం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బెంగళూరులో వెలుగుచూసిన ఈ దారుణ ఘటనలో తాజాగా తమిళనాడులోని సేలం జిల్లా ఏర్కాడ్ ఘాట్ అటవీ ప్రాంతంలో భార్య, అత్త మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నంది కొండల సమీపంలో ఏడేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. దీంతో ఇప్పటివరకు మొత్తం మూడు మృతదేహాలు లభించగా.. మరో నాలుగు మృతదేహాల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

భార్య కుటుంబంతో విభేదాలు.. ఏడుగురి హత్యకు కుట్ర?

బెంగళూరులోని రాజాజీనగర్‌కు చెందిన ఎస్‌. ఇందుశేఖర్ అలియాస్ శేఖర్ (52) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య సునీతతో చాలాకాలంగా కుటుంబపరమైన విభేదాలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. భార్య తన పుట్టింటి వారితో సన్నిహితంగా ఉండటంపై తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. అత్తింటి వారు తనను గౌరవించడం లేదన్న అసంతృప్తి కూడా అతడిలో పెరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భార్య సునీతతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసినట్లు ఇందుశేఖర్‌పై పోలీసులు నమోదు చేశారు. మృతుల్లో భార్య సునీత, అత్త రూపావతి, భార్య సోదరులు శివకుమార్, శంకర్, వారి భార్యలు దివ్య, నళిని, ఏడేళ్ల బాలుడు పునీత్ ఉన్నారు.

మిస్సింగ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘోరం!

కుటుంబ సభ్యులు వరుసగా కనిపించకుండా పోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా నళిని తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో శ్రీరాంపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో అనుమానం ఇందుశేఖర్‌పైకి వెళ్లింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏడుగురి హత్యకు సంబంధించిన భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితులను ఇంటికి పిలిపించి నిద్ర మాత్రలు కలిపిన ఆహారం, పానీయాలు ఇచ్చాడు. వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత గ్రైండింగ్ రాయితో దాడి చేసినట్లు నిందితుడు విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ హత్యలు అక్టోబర్ మధ్య నుంచి నవంబర్ మొదటి తేదీ వరకు వేర్వేరు సందర్భాల్లో జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఏర్కాడ్ ఘాట్‌లో రెండు మృతదేహాలు!

నిందితుడు ఇచ్చిన సమాచారంతో కర్ణాటక పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా తమిళనాడులోని సేలం జిల్లా ఏర్కాడ్ ఘాట్ ప్రాంతానికి చేరుకున్నారు. ఏర్కాడ్ నుంచి నాగలూరు వెళ్లే మార్గంలోని కడుక్కమరం ప్రాంతంలో ప్రైవేట్ ఎస్టేట్ సమీపంలో సుమారు 30 అడుగుల లోతైన లోయలో రెండు మృతదేహాలను గుర్తించారు. దుప్పట్లు, ఇతర సామగ్రితో చుట్టి మూటలుగా పడేసిన స్థితిలో అవి కనిపించాయి. తీవ్రంగా కుళ్లిపోయిన ఆ మృతదేహాలను పరిశీలించిన పోలీసులు.. నిందితుడు ఇందుశేఖర్ గుర్తింపు ప్రకారం అవి అతడి భార్య సునీత, అత్త రూపావతికి చెందినవిగా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం, ఇతర చట్టపరమైన ప్రక్రియల కోసం ఏర్పాట్లు చేశారు.

నంది కొండల వద్ద బాలుడి మృతదేహం!

ఈ కేసులో అంతకుముందే ఏడేళ్ల బాలుడు పునీత్ మృతదేహాన్ని కర్ణాటకలోని నంది కొండల సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బాలుడు నిందితుడి భార్య సోదరుడు శివకుమార్ కుమారుడు. తాజాగా ఏర్కాడ్‌లో మరో రెండు మృతదేహాలు లభించడంతో ఇప్పటివరకు మూడు మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. మిగిలిన నలుగురి మృతదేహాల కోసం పోలీసులు నంది కొండలు, చాముండి కొండలు, శిరాడి ఘాట్ తదితర ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు.

కూతురి పాత్రపైనా దర్యాప్తు!

ఈ కేసులో మరో సంచలన అంశం నిందితుడి కుమార్తె పాత్ర. మృతదేహాలను తరలించడం, వాటిని వేర్వేరు ప్రాంతాల్లో పడేయడంలో ఆమె సహకారం ఉందన్న ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులను నమ్మించి ఇంటికి పిలిపించడం నుంచి మృతదేహాలను తరలించడం వరకు జరిగిన పరిణామాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఆమె పాత్రపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.

మూడు మృతదేహాలు లభ్యం.. నాలుగు కోసం గాలింపు!

మొత్తంగా కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడుగురి హత్యకు సంబంధించిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడు చెప్పిన ప్రాంతాల్లో గాలింపు చేపడుతున్నారు. హత్యలకు అసలు కారణాలు, ముందస్తు ప్రణాళిక, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. మిగిలిన నలుగురి మృతదేహాలు ఎక్కడ ఉన్నాయి? ఈ దారుణం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? నిందితుడి కుమార్తె పాత్ర ఎంతవరకు ఉంది? అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు లభించాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us