Telangana: భువనగిరి కోర్టు సంచలన తీర్పు.. 14 మందికి జీవిత ఖైదు

| Edited By: Srilakshmi C

Jan 31, 2024 | 8:44 AM

నేటి ఆధునిక యుగంలో కూడా మూఢనమ్మకాలు పల్లెలను పట్టిపీడిస్తున్నాయి. చేతబడి చేస్తున్నాడనే నెపంతో వ్యక్తిపై దాడి చేయగా ఆ వ్యక్తి మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ భువనగిరి జిల్లా అదనపు సెషన్ కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్ష పడిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్తతో పాటు వారి కుమారుడు ఉన్నారు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం దిలావర్‌పూర్‌కు చెందిన..

Telangana: భువనగిరి కోర్టు సంచలన తీర్పు.. 14 మందికి జీవిత ఖైదు
Court Verdict
Follow us on

భువనగిరి, జనవరి 31: నేటి ఆధునిక యుగంలో కూడా మూఢనమ్మకాలు పల్లెలను పట్టిపీడిస్తున్నాయి. చేతబడి చేస్తున్నాడనే నెపంతో వ్యక్తిపై దాడి చేయగా ఆ వ్యక్తి మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ భువనగిరి జిల్లా అదనపు సెషన్ కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్ష పడిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్తతో పాటు వారి కుమారుడు ఉన్నారు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం దిలావర్‌పూర్‌కు చెందిన రాజేష్‌ తల్లి 2017లో బాత్‌రూమ్‌లో పడి కాలువిరిగి కొద్ది రోజులకు చనిపోయింది. ఆమె చనిపోయిన 9నెలలకు తండ్రి అయ్యన్న ఆకస్మికంగా చనిపోయాడు. అయితే, ఇంటి పక్కనే ఉండే సీస యాదగిరి (85) చేతబడి చేశాడని, తన తల్లిదండ్రులు చనిపోవటానికి యాదగిరి కారణమని రాజేష్‌ అతనిపై కక్ష పెంచుకున్నారు.

2018 ఆగస్టు 10న క్షుద్ర పూజలు చేస్తున్నాడని ఆరోపిస్తూ యాదగిరిపై రాజేష్ తో పాటు మరికొందరు దాడి చేయగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యాదగిరి మృతి చెందాడు. మృతుడి కుమారుడు సీస గోవర్దన్‌ ఫిర్యాదు మేరకు మోటకొండూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బుర్రి రాజేష్‌(21), చొప్పరి శ్రావణ్‌(25), చొప్పరి నరేష్‌(30), చొప్పరి సత్యనారాయణ(50), చొప్పరి అంజమ్మ(38), చిక్క సత్యనారాయణ(42), దండు రవి(34), చొప్పరి శంకరయ్య(50), చొప్పరి మహేందర్‌(32), చొప్పరి సందీప్‌(26), చిక్క సత్తయ్య, మంగళ్ల పుల్లయ్య(43), చొప్పరి రోశయ్య, రాపాక లలిత(45) మొత్తం 14 మంది నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. నేరాలకు సంబంధించిన ఆధారాలు, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలతో కోర్టులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఆరు సంవత్సరాలుగా వాదోపవాదాలు విన్న న్యాయమూర్తులు.. నేరం రుజువు కావడంతో జిల్లా అదనపు సెషన్ కోర్టు జడ్జీ మారుతీదేవి వీరికి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితుల్లో ఒకరైన కవాటి కరుణాకర్‌ కేసు విచారణలో ఉండగా మృతిచెందాడు. మిగిలిన వారిని భువనగిరి కోర్టు నుంచి హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు తరలించారు. శిక్ష పడినవారిలో ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్తతో పాటు వారి కుమారుడు ఉన్నారు. వీరిని తరలిస్తున్న క్రమంలో నిందితుల కుటుంబ సభ్యులు, బంధువులు కోర్టు ప్రాంగణంలో రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.