అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు..? తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫైర్..
ప్రజల పక్షాన పనిచేసేందుకు అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు దండగ అంటున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారని చంద్రబాబు, స్పీకర్ విమర్శిస్తే..తెలంగాణలో కేసీఆర్ తీరును ఎండగట్టారు సీఎం రేవంత్. ఆ వివరాలు ఇలా..

ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు.. వారుకూడా ఒకవిధంగా ప్రభుత్వ ఉద్యోగులే.. ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రతి నెలా జీత భత్యాలు తీసుకునే వారు ఎన్నుకున్న ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే ఎలా? అనే ప్రశ్న అసెంబ్లీలో లేవనెత్తారు సీఎం చంద్రబాబు, స్పీ్కర్ అయ్యన్న పాత్రుడు. వైసీపీ సభ్యులు కొంత మంది శాసన సభకు హాజరైనట్లుగా రిజిస్టర్‌లో సంతకాలు చేశారని వారెవరూ తనకు సభలో కనిపించలేదన్నారు చంద్రబాబు. గవర్నర్ ప్రసంగం తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా, కేవలం రిజిస్టర్‌లో సంతకాలు చేయడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. దొంగల్లా వచ్చి సంతకాలు చేయడం ఎందుకని.. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ధైర్యంగా సభకు రాలేరా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే పాయింట్ లేవనెత్తారు. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ 57లక్షల జీతం తీసుకున్నారని..ప్రజల సొమ్ము జీతంగా పొందుతున్న కేసీఆర్ అసెంబ్లీకి సమావేశాలకు వచ్చి తెలంగాణ అభివృద్ధికి సలహాలు ఇవ్వకుండా హౌస్‌లో ఉండిపోవడం సమంజసమా అని రేవంత్ ప్రశ్నించారు. అసెంబ్లీ అటెండెన్స్ అంశంలో ఇటు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్ అయిన నేపథ్యంలో భవిష్యత్‌లోనైనా వీరి తీరు మారుతుందో లేదో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.