AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఒకేసారి వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ.. ఉదారత చాటుకున్న ముస్లింలు..

భారతదేశం అంటేనే సర్వమత సౌభాతృత్వానికి ప్రతీక... వివిధ జాతులు, వివిధ మతాలతో ప్రపంచ దేశాలలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది మన దేశం. హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని చాటడమే కాదు.. ఆచరణలో కూడా చేసి చూపించే సంఘటనలు ఎన్నో జరిగాయి.. ఇదే క్రమంలో..

Hyderabad: ఒకేసారి వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ.. ఉదారత చాటుకున్న ముస్లింలు..
Ahead of Ganesh immersion, Milad-un Nabi procession postponed
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Sep 14, 2024 | 7:34 PM

Share

భారతదేశం అంటేనే సర్వమత సౌభాతృత్వానికి ప్రతీక… వివిధ జాతులు, వివిధ మతాలతో ప్రపంచ దేశాలలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది మన దేశం. హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని చాటడమే కాదు.. ఆచరణలో కూడా చేసి చూపించే సంఘటనలు ఎన్నో జరిగాయి.. ఇదే క్రమంలో గత రెండు సంవత్సరాలుగా హిందూ, ముస్లిం సోదరులకు సంబంధించిన పండుగలు ఒకే రోజు రావడం, వాటిని సర్దుబాటు చర్యలతో ఎలాంటి బేధాలు, గొడవలు లేకుండా జరుపుకుంటూ ఐక్యతను చాటుతున్నారు..

ప్రస్తుతం హిందువులకు అతి ముఖ్యమైన పర్వదినం వినాయక నవరాత్రులు కొనసాగుతున్నాయి. పండగ ప్రారంభమైన రోజు నుంచి గణేషుడి ప్రతిష్టాపన మొదలుకుని మండపం అలంకరణ, పూజలు, అన్న వితరణ ఇలా ఎన్నో రకాలుగా పండగను ఘనంగా జరుపుతారు. నవరాత్రుల్లో రోజూ మండపాల వద్ద ప్రత్యేక పూజలు, ప్రసాదాల పంపిణీలతో హడావిడి వాతావరణం ఉంటుంది. ఇక గణేష్ నిమజ్జనం కార్యక్రమం ఎంత సందడిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సంవత్సరం వినాయక నిమజ్జనం ఈ నెల 17వ తేదీన జరపనున్నారు. అయితే.. ఇదే తేదీన మిలాద్ ఉన్ నబీ పర్వదినం కూడా వచ్చింది. మిలాద్ ఉన్ నబీ అంటే మొహమ్మద్ ప్రవక్త జయంతి పురస్కరించుకుని నిర్వహిస్తారు. ఇది ముస్లిం సోదరులకు అతి ముఖ్యమైన పండగ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు మొహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా మసీదుల వద్ద నమాజులు, ఊరేగింపులు వంటివి పెద్దఎత్తున జరుపుతారు. అయితే.. ఈ ఏడాది రెండు పండుగలు ఒకేసారి రావటంతో ముస్లిం సోదరులు తమ పండుగను కొంచెం ముందుకు నిర్వహించాలని నిర్ణయించి తమ ఉదారతను చాటుకున్నారు. సెప్టెంబర్ 19న హైదరాబాద్‌లో మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు నిర్వహించనున్నారు.

ఈ రెండు పండుగలు, రెండు మతాల వారికి అత్యంత ముఖ్యమైన పండుగలే. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ పోలీసు శాఖ కోరిక మేరకు ముస్లిం మత పెద్దలు ముందుకు వచ్చి మిలాద్ ఉన్ నబీని మూడు రోజులు ముందుకు పొడిగిస్తున్నట్లు ప్రకటించి మరోసారి సోదరభావాన్ని చాటారు. హిందువులకు, ముస్లింలకు కూడా ముఖ్యమైన పండుగలు కాబట్టి ప్రతి ఒక్కరు పండుగలను సంప్రదాయ బద్దంగా జరుపుకుని సంతోషంగా ఉండాలని కోరారు.

వీడియో చూడండి..

కాగా, మిలాద్ ఉన్న నబీ వేడుకలకు సంబంధించి.. అల్ అరిఫ్ ఉనని హాస్పిటల్లో మిలాద్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హైదరాబాద్‌ కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఈ మేరకు సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ విషయంలో అందరూ తమ సహాయ సహకారాలు అందిస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. సమావేశానికి హాజరైన ముస్లిం సోదరులు ఇందుకు మద్దతు ప్రకటించారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..