Kothagudem Corporation Election Result: కొత్తగూడెంలో కొత్త ట్విస్ట్.. కాంగ్రెస్ – సీపీఐ హోరాహోరీ.. మేయర్ పీఠంపై ఉత్కంఠ..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొత్తగూడెం కార్పొరేషన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్త చర్చకు వేదికైంది. ఓటరు తీర్పుతో ఊహించని విధంగా హంగ్ ఏర్పడింది. హస్తం పార్టీ ప్రభంజనాన్ని అడ్డుకుంటూ సీపీఐ తన పట్టు నిలుపుకోవడంతో రెండు పార్టీలు చెరో 22 స్థానాలతో సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇరు పార్టీలు ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మెజార్టీ స్థానాల్లో గెలిపొంది ప్రత్యర్థులకు గట్టి షాక్ ఇచ్చింది. కొత్తగూడెం కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపాయి. రాష్ట్రవ్యాప్తంగా పొత్తులో ఉన్న సీపీఐ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వేర్వేరుగా పోటీ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించినా.. కొత్తగూడెం కార్పొరేషన్‌లో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం 60 డివిజన్లకు గాను పాలకపక్షం కాంగ్రెస్, మిత్రపక్షంగా భావించే సీపీఐ చెరో 22 స్థానాలను దక్కించుకుని సమాన బలాబలాలతో నిలవడం ఇక్కడ విశేషం.
ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదరకపోవడంతో ఇరు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగాయి. ఫలితంగా ఓట్లు చీలిపోయి ఎవరికీ మేజిక్ ఫిగర్ దక్కలేదు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ రఘురామిరెడ్డి ఇద్దరికీ చెరో ఎక్స్ అఫీషియో ఓటు ఉన్నప్పటికీ.. అవి కలిపినా మెజారిటీకి కావాల్సిన 31 మార్కును అందుకోవడం కష్టంగా మారింది. దీంతో ఇరు పార్టీలు ఇప్పుడు ఇతర పక్షాల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలో 8 స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు కింగ్ మేకర్‌గా మారింది. ఎన్నికలకు ముందు సీపీఐతో పొత్తు కోసం ప్రయత్నించి విఫలమైన బీఆర్ఎస్, ఇప్పుడు ఫలితాల తర్వాత సీపీఐకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఒక డివిజన్ గెలిచిన సీపీఎం, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల నిర్ణయం కూడా మేయర్ పీఠాన్ని నిర్ణయించడంలో కీలకం కానుంది. సీపీఐ ఇప్పటికే సీపీఎం మద్దతుపై ఆశలు పెట్టుకోగా బీఆర్ఎస్ కూడా తమకు కలిసొస్తుందని భావిస్తోంది.
ప్రస్తుతానికి కొత్తగూడెం కార్పొరేషన్ రాజకీయం ఒక పీటముడిలా మారింది. కాంగ్రెస్ తన మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి స్వతంత్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా.. సీపీఐ మాత్రం పాత మిత్రుల మద్దతుతో పీఠం దక్కించుకోవాలని చూస్తోంది.
