Telangana: తెలంగాణకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. ప్రాజెక్టులకు లైన్ క్లియర్
సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల అనుమతులు పూర్తిగా చెల్లుబాటులోనే ఉంటాయని సుప్రీం తెలిపింది. 2021లో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమొరాండంను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వివరాలు చూస్తే..

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు పొందిన పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల అనుమతులు పూర్తిగా చెల్లుబాటులోనే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు 2021లో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమొరాండం(OM)ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ OM కారణంగా ఏర్పడిన న్యాయపరమైన అనిశ్చితి తొలగిపోవడంతో.. కొనసాగుతున్న ప్రాజెక్టుల పనులకు ఎలాంటి అడ్డంకి లేదని స్పష్టమైంది. అయితే కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు మాత్రం పర్యావరణ చట్టాల ప్రకారం ముందుగానే అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుపై రాష్ట్ర వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఖమ్మం జిల్లాలోని ప్రతిష్టాత్మక సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిందని మంత్రి తెలిపారు.
సీతమ్మసాగర్ ప్రాజెక్టు ద్వారా 36.37 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు 6 లక్షల 74 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని మంత్రి తుమ్మల వెల్లడించారు. అంతేకాదు ఈ ప్రాజెక్టు ద్వారా 282.80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించేలా కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులకు మంత్రి తుమ్మల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మొత్తంగా సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణలో ఇప్పటికే అనుమతులు పొందిన ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్న న్యాయపరమైన అనిశ్చితి తొలగింది. ముఖ్యంగా సీతమ్మసాగర్ ప్రాజెక్టు అమలుకు కీలక అడ్డంకి తొలగడంతో ప్రాజెక్టు పనులు మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఢిల్లీలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
ఈ భేటీలో తుంగభద్ర, కృష్ణా జలాల పంపిణీ, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం, రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చించారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఇరు రాష్ట్రాల నేతలు అభిప్రాయపడ్డారు. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పుతో పర్యావరణ అనుమతుల విషయంలో ఊరట లభించగా… మరోవైపు కర్ణాటకతో జల వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలు కొనసాగించడం తెలంగాణ ఇరిగేషన్ రంగంలో మరో కీలక పరిణామంగా మారింది.
