Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో డబుల్ డెక్కర్ కారిడార్.. తగ్గనున్న ట్రాఫిక్
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారిని ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఆ రూట్‌లో ఇక గంటల తరబడి ట్రాఫిక్‌లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కి.మీ మేర డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా త్వరలో కేంద్రం సహకారం కోసం త్వరలోనే మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రమంత్రి గడ్కరీతో భేటీ కానున్నారు.

హైదరాబాద్ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు రూ.941 కోట్లతో 7.1 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబోతున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే స్థానికంగా ఉన్న 54 కాలనీల ప్రజలతో పాటు హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందన్నారు.ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిందని.. కేంద్ర సహాకారం కోసం త్వరలోనే కేంద్రమంత్రి గడ్కరీతో భేటీ కానున్నట్టు మంత్రి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే కేవలం 15 నిమిషాల్లోనే ఎల్బీ నగర్ నుంచి సిటీ దాటి వెళ్లొచ్చని ఆయన అన్నారు.
తాజాగా ఎల్బీ నగర్ హయత్ నగర్ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు మంత్రి సచివాలయంలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. తాజా నిర్మించబోయే కారిడార్‌కు సర్వీస్ రోడ్లు, జాతీయ రహదారి, మెట్రో రైలు మౌలిక సదుపాయాల అనుసంధానంపై అధికారులతో చర్చించారు. వెడల్పాటి పిల్లర్ల రూపకల్పన, మెట్రో నిర్మాణాలు, స్టేషన్లతో అనుసంధానం వంటి కీలక అంశాలను కూడా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగ్‌పూర్ తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద డబుల్ డెక్కర్ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టులలో ప్రస్తుతం నిర్మించబోయే కారిడార్ నిలుస్తుందని అన్నారు. ఈ రూచ్‌లో ఈ మధ్య కాలంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదలను తగ్గించి.. ఈ రూట్‌ను ప్రమాద రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్థానిక రాకపోకల కోసం సర్వీస్ రోడ్లు ఉండగా, ప్రధాన వాహనాలు ఎలివేటెడ్ స్థాయిలలో ప్రయాణిస్తాయన్నారు.
అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 941 కోట్ల అంచనా వేసిందని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 200 కోట్లు అందించడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు మంత్రి తెలిపారు. మిగిలిన సహాకారం కోసం కేంద్రంలో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి, టెండర్లను ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
