AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: థర్టీఫస్ట్‌ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కుతారా.. కోర్టు మెట్లెక్కుతారా..? ఓవరాక్షన్లకు పోతే వీరబాదుడే.!

న్యూ ఇయర్ నైట్‌..కౌంట్‌డౌన్ మొదలైంది. కానీ రోడ్లపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి కఠిన నిఘా ఉంటుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జరిమానా కాదు.. జైలు శిక్ష తప్పదంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.

Hyderabad: థర్టీఫస్ట్‌ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కుతారా.. కోర్టు మెట్లెక్కుతారా..? ఓవరాక్షన్లకు పోతే వీరబాదుడే.!
Hyderabad
Ravi Kiran
|

Updated on: Dec 30, 2025 | 2:04 PM

Share

న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీస్ కీలక ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిధి అంతటా కఠిన చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. క్యాబ్‌, టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించి, అవసరమైన డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాలని సూచించారు. ప్రయాణికులను ఎక్కించుకోనని నిరాకరించడం నేరమని, అధిక చార్జీలు వసూలు చేసినా, దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రయాణికుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ 9490617346ను అందుబాటులో ఉంచారు. బార్లు, పబ్బులు, క్లబ్బుల యాజమాన్యాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపనివ్వకూడదని, అలా జరిగితే యాజమాన్యంపై సహకరించినట్లు కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కస్టమర్లకు అవగాహన కల్పించి, సురక్షిత రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సాధారణ ప్రజల కోసం ప్రత్యేక కెమెరాలతో నిఘా పెంచారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, రాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, తప్పు పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తారు. డాక్యుమెంట్లు చూపించని వాహనాలను డిటైన్ చేస్తారు. అధిక శబ్దంతో మ్యూజిక్‌, నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తారు. మైనర్లు వాహనాలు నడిపితే వాహన స్వాధీనంతో పాటు కేసులు నమోదు చేస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే మొదటి సారి రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష, మళ్లీ చేస్తే రూ.15 వేల జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా శాశ్వత రద్దు కూడా చేస్తామని హెచ్చరించారు. మద్యం మత్తులో ప్రాణాంతక ప్రమాదం జరిగితే బీఎన్‌ఎస్ 2023 ప్రకారం అరెస్టు చేస్తామని తెలిపారు. బాధ్యతాయుతంగా న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలని, రోడ్డుపై ప్రతి ఒక్కరి భద్రతకే ఈ చర్యలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ… డ్రైవ్ సేఫ్లీ… హోమ్ సేఫ్‌గా చేరండని అనే నినాదంతో ముందుకెళ్తున్నారు ట్రాఫిక్ పోలీసులు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..