Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్!
రూల్స్ పాటించని వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆగస్టు 12-18న వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ క్రమశిక్షణ, రోడ్డు భద్రత లక్ష్యంగా చేపట్టిన ఈ డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

హైదరాబాద్, 20 ఆగస్ట్: ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిబంధనలు పాటించని వారిపై భారీగా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 12 నుంచి 18 వరకు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఫ్రీ లెఫ్ట్‌ను అడ్డుకున్న సుమారు 1,005 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. బిజీ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఫ్రీ లెఫ్ట్ మార్గాలను కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా బ్లాక్ చేస్తున్నారని.. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ కదలిక మందగించి.. ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అందువల్ల ఫ్రీ లెఫ్ట్ మార్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవద్దని వాహనదారులకు సూచించారు.
ఇదే స్పెషల్ డ్రైవ్‌లో మైనర్లు వాహనాలు నడిపిన 334 కేసులు కూడా నమోదయ్యాయి. మైనర్లకు వాహనాలు అప్పగించకుండా తల్లిదండ్రులు, వాహన యజమానులు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు వాహనాలు ఇవ్వడం నేరమని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తమ వాహనాలను వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే.. సంబంధిత వాహన యజమానులపైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతో పాటు నగరంలో వాహనాల రాకపోకలను సజావుగా కొనసాగించవచ్చని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ క్రమశిక్షణ, రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లను ఇకముందూ కొనసాగిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
