Spa: స్పా సెంటర్లలో ఇకపై ఇవి పక్కా ఉండాల్సిందే..! రాత్రి 9 గంటల తర్వాత..
హైదరాబాద్‌లోని స్పా సెంటర్లలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు స్పా యజమానులతో సమావేశం నిర్వహించి, కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఇందులో పని గంటలు, ఉద్యోగి వివరాలు నమోదు, CCTV కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి చేశారు.

హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా అనేక స్పా సెంటర్లు ఉన్నాయి. ఈ స్పా సెంటర్ల పై నిత్యం పోలీసులు నిఘా తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో స్పా సెంటర్స్ ముసుగులో అనేక మంది నిర్వాహకులు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోనున్నారు. లీగల్ గాను ఈ స్పా సెంటర్ల వ్యవహారంపై పోలీసులు దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగా సైబరాబాద్ AHTU, లా అండ్ ఆర్డర్, SOT స్పా సెంటర్ యజమానులతో ఉమ్మడి అవగాహన సమావేశం నిర్వహించాయి. మాదాపూర్ జోన్ పరిధిలోని సైబరాబాద్ పోలీసుల యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), లా అండ్ ఆర్డర్ వింగ్, స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) సంయుక్తంగా జూలై 4, 2025న సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ ఆడిటోరియంలో స్పా సెంటర్ యజమానులు, ప్రతినిధులతో సమన్వయ, అవగాహన సమావేశాన్ని నిర్వహించాయి.
స్పా సెంటర్లకు పోలీసులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రాంగణంలో ఏ విధమైన అసాంఘిక చర్యలకు పాల్పడినా లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. స్పా, మసాజ్ కేంద్రాలు ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 గంటల మధ్య మాత్రమే పనిచేయాలి. ప్రాంగణాన్ని నివాస ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు లేదా ఏదైనా నివాస ప్రాంతానికి అనుసంధానించకూడదనీ పోలీసులు తెలిపారు. ఆక్యుప్రెషర్ లేదా ఆక్యుపేషనల్ థెరపీలో అర్హతలను కలిగి ఉన్నవారిని మాత్రమే నియమించుకోవాలని సూచించారు. హౌస్ కీపింగ్ సిబ్బందితో సహా ఉద్యోగుల అందరి వివరాలను రిజిస్టర్‌లో నిర్వహించాలి. సిబ్బంది వయసు కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. స్పా సెంటర్ లో లైసెన్స్ నంబర్, లైసెన్స్ వివరాలు, పని గంటలను ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలి. అదనంగా లైసెన్స్ హోల్డర్, మేనేజర్, ఉద్యోగుల వివరాలు, పని గంటలు, అందించే మసాజ్ రకాలు వివరాలను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు.
రికార్డింగ్ సౌకర్యాలతో కూడిన CCTV కెమెరాలు ఎంట్రన్స్, రిసెప్షన్, సాధారణ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి. రికార్డింగ్‌లను కనీసం మూడు నెలల పాటు భద్రపరచాలి. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం ప్రకారం, పది మంది కంటే ఎక్కువ మంది సిబ్బందిని నియమించే స్పా సెంటర్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చట్టాల ప్రకారం శిక్షార్హమైన చర్యలు తీసుకుంటారు. ఏదైనా నేరపూరిత కార్యకలాపాలు జరిగితే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి