Hyderabad: “మరో 48 గంటల్లో మీ ముగ్గురు అతి భయంకరంగా చావబోతున్నారు”.. వాట్సాప్‌లో మెసేజ్.. చివరికి..!
"మీ కుటుంబంపై చేతబడి చేశా.. ఈ రోజు అమావాస్య.. మరో 48 గంటల్లో మీ ముగ్గురు అతి భయంకరంగా చావబోతున్నారు" అని వాట్సాప్‌లో వీడియోలు పంపి బెదిరించిన ఓ వ్యక్తిని సౌత్‌ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దందాలు వదిలేశారు.. దౌర్జన్యాలు ఆపేశారు.. కత్తులు పట్టుకోవడం మానేసి.. గుండు సూదులతో గడబిడ క్రియేట్ చేస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కొంతమంది రౌడీషీటర్లు చేస్తున్న ఈ దందా… భయబ్రాంతులకి గురిచేస్తోంది. ఇంతకీ రౌడీలు ఎందుకు రూట్ మార్చారు? వాళ్ల ప్లానేంటి.. స్కెచ్చేంటి?
రౌడీషీటర్ ముదిరితే.. మంత్ర తంత్రాల బాబా..!! యస్.. హైదరాబాద్ పాతబస్తీలో ఆపరేషన్ క్షుద్ర ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. కత్తి పట్టుకుంటే ఖాకీలతో పరేషాన్ అనుకున్నారో.. రక్తపు మరకల చూసీ చూసీ విసిగి వేసారారో తెలియదు.. కూల్‌గా ఓం బీమ్ బుష్ అంటూ రాంగ్‌రూట్ సంపాదనకు ఎగబడ్డారు.
“మీ కుటుంబంపై చేతబడి చేశా.. ఈ రోజు అమావాస్య.. మరో 48 గంటల్లో మీ ముగ్గురు అతి భయంకరంగా చావబోతున్నారు” అని వాట్సాప్‌లో వీడియోలు పంపి బెదిరించిన ఓ వ్యక్తిని సౌత్‌ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు మీద ఆశతో చేసిన ఈ దారుణ ఘటన ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. కాగా, దీనికి సంబంధించి టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పిండితో మనిషి ఆకారంలో బొమ్మ.. మధ్యలో భారీ సైజులో ఉన్న సూది.. దానిపై పసుపు, కుంకుమ చల్లి.. పక్కన నిమ్మకాయలు, ఎర్రని మిరపకాయలు.. ఈ ఇమేజ్ చూస్తుంటేనే దేనికో స్కెచ్ గీశారన్న అనుమానాలు కలుగుతున్నాయి కదూ.. బహదూర్‌పురా హసన్ నగర్‌కు చెందిన ఇతను మహ్మద్ ఖలీం అలియాస్ ఖాలీ. బ్యాగ్రౌండ్ అంతా రౌడీయిజమే. దందాలు చేయడం అడ్డొస్తే దాడులు చేయడం. ఇందుకు సంబంధించి వేర్వేరు పీఎస్‌లలో కేసులు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఖలీం మారిపోయాడు. అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లి అవతారం మార్చేశాడు. రౌడీయిజాన్ని పక్కనపెట్టి బాబా అవతారమెత్తాడని డీసీపీ తెలిపారు. కాకపోతే బాబా గెటప్‌కి బ్లాక్‌మెయిలింగ్ జోడించాడు.
హైదరాబాద్ మహానగరం ఫలక్‌నుమా అలజుబేల్ కాలనీకి చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్ ఆలీఖాన్, తన సోదరి, తల్లితో కలిసి నివసిస్తున్నారు. అయితే.. అక్టోబర్ 2వ తేదీన అర్ధరాత్రి 10 గంటలకు మొహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘ఈ రోజు అమావాస్య.. మరో 48 గంటల్లో మీరు చనిపోతున్నారు’ అని ఆ వ్యక్తి బెదిరించి కాల్‌ను డిస్‌కనెక్ట్ చేశాడు. ఇది జరిగిన కాసేపటికే ఇర్ఫాన్ ఆలీఖాన్, అతని సోదరితో పాటు తల్లికి సంబంధించిన ఫొటోలకు చేతబడి చేస్తున్న ఒక భయంకరమైన వీడియోను సదరు వ్యక్తి వాట్సాప్ ద్వారా పంపించాడు. దీంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తమ ఆస్తిని కాజేయడానికి తమను శారీరకంగా, మానసికంగా దెబ్బతీయడానికి తమ వదిన నాజియానే ఇలా కుట్ర పన్నిందని ఇర్ఫాన్ ఆలీఖాన్ అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే ఈ విషయమై బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి చేతబడికి పాల్పడిన సదరు గుర్తు తెలియని వ్యక్తి పరారీలో ఉన్నాడు.
ఇర్ఫాన్ ఆలీఖాన్ ఫిర్యాదు మేరకు టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ పర్యవేక్షణలో సౌత్‌ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ ప్రసాద్ వర్మ బృందం, బండ్లగూడ ఇన్స్‌పెక్టర్ సత్యనాయణ టీమ్‌తో కలిసి పరారీలో ఉన్న బహదూర్‌పురా, హసన్‌నగర్‌కు చెందిన మొహమ్మద్ ఖలీం అలియాస్ ఖాలీ (48) అనే రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఆపై పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. తన అత్త, ఆడపడుచు, మరిదిలు తనను వేధిస్తున్నారంటూ నాజియా అనే మహిళ మొహమ్మద్ ఖలీంను ఆశ్రయించింది. దీంతో అవసరం కోసం వచ్చిన ఆ మహిళను అవకాశంగా వినియోగించుకోవాలని కుట్ర పన్నాడు ఆ రౌడీ షీటర్. తనకు అవసరమైనన్ని డబ్బులు ఇస్తే ఈ అమావాస్య తరువాత 48 గంటల్లో మీ అత్త, ఆడపడుచు, మరిదిలు భయంకరంగా చచ్చేటట్లు చేస్తానని నాజియాకు చెప్పాడు.
ఈ దెబ్బతో తాను కక్ష పెంచుకున్న ఆ ముగ్గురి పీడ విరగడ అవుతుందని, తనకు ఎలాంటి అడ్డు ఉండదని ఆ మహిళ నమ్మింది. ఆ ముగ్గురి ఫొటోలు సేకరించి, వారిపై చేతబడికి పాల్పడుతున్న దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి తిరిగి వారికే వాట్సాప్‌లో పంపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చేతబడికి పాల్పడిన మొహమ్మద్ ఖలీంను సౌత్‌ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి క్షుద్ర పూజల సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని బండ్లగూడ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా చేతబడులు అంటూ నమ్మే జనాలు ఉన్నారా అంటూ పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. కత్తులు, కంటి చూపులు అక్కర్లేకుండా ఇలా బ్లాక్ మ్యాజిక్‌తో బెంబేలెత్తించాలనుకున్నారు. కానీ బొమ్మ రివర్స్ అయింది. మ్యాటర్ అంతా బూమరాంగ్ కావడంతో ఖలీం ఊచలు లెక్కిస్తున్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..