Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!
నగరంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి.. రద్దీని తగ్గించేందుకు ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రూ.345 కోట్లతో మరో ఫ్లైఓవర్ నిర్మించేందుకు జీహెచ్‌ఎమ్‌సీ సిద్ధమైంది.

హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ రద్దీని తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవలే నగరవ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారులను 60 మీటర్ల మేర విస్తరించాలని నిర్ణయించిన జీహెచ్‌ఎమ్‌సీ, తాజాగా మరొక నిర్ణయం తీసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి – శంషాబాద్ మధ్య ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్ నిర్మించేందుకు సిద్ధమైంది.
మైలార్‌దేవ్‌పల్లి నుండి కాటేదాన్ మీదుగా శంషాబాద్ రోడ్డు వరకు 6 లేన్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.345 కోట్లు అవుతుందని అంచనా వేసిన జీహెచ్‌ఎమ్‌సీ, ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేసింది. దీనిని పరిశీలించి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టాలని జీహెచ్‌ఎమ్‌సీ భావిస్తోంది. ఈ మేరకు మిగతా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ముఖ్యంగా పాతబస్తీ, ఎల్‌బీ నగర్, కంచన్‌బాగ్, హయత్‌నగర్ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. ప్రస్తుతం పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలు ఒవైసీ, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్లు దాటిన తర్వాత మైలార్‌దేవ్‌పల్లి వద్దకు రాగానే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తే ఈ ట్రాఫిక్ సమస్య తగ్గి, సులువుగా శంషాబాద్ చేరుకోవచ్చు.
ట్రాఫిక్ సమస్య తగ్గడంతో వాహనదారులకు పెద్ద ఊరట లభిస్తుంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో వేచి ఉండే సమయం తగ్గుతుంది. అలాగే ఇంధన ఖర్చులు తగ్గి వారి నెలవారీ బడ్జెట్‌కు తోడ్పడుతుంది. అందుకే వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, ఫ్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్‌ఎమ్‌సీ యోచిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
