Telangana: శత్రుత్వాన్ని గెలిచిన అమ్మప్రేమ.. తల్లిలేని పిల్లి పిల్లకు ప్రాణం పోసిన కుక్క.. వీడియో వైరల్..
కుక్క, పిల్లి ఎదురుపడితే చాలు రచ్చ రచ్చే.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. శత్రుత్వాన్ని మరిచి, తల్లిలేని పిల్లి పిల్లకు పాలిచ్చి కడుపు నింపింది ఓ శునకం. ఖమ్మం జిల్లాలో మనుషుల్లో నానాటికీ కనుమరుగవుతున్న మానవత్వానికి, ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ అరుదైన సీన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ప్రకృతి సహజంగా కుక్క, పిల్లి అంటేనే ఉప్పు-నిప్పు. ఒకదానికొకటి ఎదురుపడితే చాలు, వెంటాడి దాడి చేసుకోవడం సహజం. అలాంటి బద్ధ శత్రుత్వాన్ని పక్కనపెట్టి, మాతృమూర్తిగా మారి ఓ పిల్లి పిల్లకు పాలిచ్చి ఆకలి తీర్చింది ఓ శునకం. మానవత్వం నానాటికీ కనుమరుగవుతున్న నేటి రోజుల్లో, మూగజీవాల మధ్య వెల్లివిరిసిన ఈ స్వచ్ఛమైన ప్రేమ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారం గ్రామంలో స్థానికులనే కాక నెటిజన్లను సైతం కట్టిపడేస్తోంది. బుద్ధారం గ్రామానికి చెందిన మేళ్లచెరువు లక్ష్మయ్య అనే గ్రామస్తుడు తన ఇంట్లో ఓ కుక్కను ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఇటీవల ఆ ప్రాంతంలో తల్లి దూరమై ఆకలితో అలమటిస్తున్న ఓ పిల్లి పిల్ల కనిపించింది. ఆకలితో నీరసించి అల్లాడుతున్న ఆ పిల్లి పిల్లను చూసిన ఆ పెంపుడు కుక్క.. తన సహజ వైరాన్ని మరిచి మాతృప్రేమను పంచింది. దగ్గరకు తీసుకుని స్వయంగా పాలు తాపుతూ దాని ఆకలిని తీర్చింది.
ఆశ్చర్యంలో గ్రామస్తులు
సాధారణంగా పిల్లులను చూడగానే మొరుగుతూ వెంటాడే శునకం.. ఇలా పిల్లి పిల్లకు ఒడినిచ్చి పాలివ్వడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. పుట్టుకతోనే శత్రువులుగా భావించే ఈ రెండు జీవుల మధ్య ఉన్న ఈ అపురూప స్నేహ బంధం గ్రామంలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. మనుషుల్లో సంబంధాలు, బంధాలు తగ్గిపోతున్న వేళ.. ఏ బంధం లేని ఓ పరాయి జీవి పట్ల ఈ శునకం చూపిన ప్రేమ నిజంగా గర్వించదగ్గదని, మూగజీవుల్లో ఇంకా మానవత్వం సజీవంగా ఉందనడానికి ఇదే సజీవ నిదర్శనమని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం శునకం పిల్లి పిల్లకు పాలిస్తున్న దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి.
