AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వినాయక విగ్రహం కోసం వెళ్తే ప్రాణమే పోయింది.. అసలేం జరిగిందంటే..?

పండుగ వేళ వినాయకుడి విగ్రహం తెచ్చుకుందామని వెళ్లిన ఆ యువకుడికి అదే ఆఖరి రోజవుతుందని ఎవరూ ఊహించలేదు. చిన్నపాటి బేరసారాల వివాదం కాస్తా రక్తపాతానికి దారితీసి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. విగ్రహ విక్రేతల చేతిలో దారుణ దాడికి గురై యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జోడిమెట్ల చౌరస్తాలో తీవ్ర కలకలం రేపింది.

Telangana: వినాయక విగ్రహం కోసం వెళ్తే ప్రాణమే పోయింది.. అసలేం జరిగిందంటే..?
Youth Beaten To Death Over Ganesh Idol
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Sep 14, 2026 | 11:31 AM

Share

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణేశుడి విగ్రహం కొనుగోలు విషయంలో తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం చినికి చినికి గాలివానలా మారి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. విగ్రహ విక్రేతల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జోడిమెట్ల చౌరస్తాలో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది. చౌదరిగూడ గ్రామానికి చెందిన కిరణ్‌ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు జోడిమెట్ల చౌరస్తాకు వెళ్లాడు. అక్కడ విగ్రహాలు అమ్ముతున్న వ్యాపారులతో ధర విషయంలో బేరసారాలు జరుగుతుండగా మాటామాటా పెరిగింది. వివాదం తీవ్రరూపం దాల్చడంతో విగ్రహ తయారీదారులు, విక్రేతలు ఒక్కసారిగా కిరణ్, అతని స్నేహితులపై కర్రలతో దాడికి దిగారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఈ దాడిలో కిరణ్‌ తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్నేహితులు, స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని సూర్య ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆదివారం రాత్రి కిరణ్‌ ప్రాణాలు విడిచాడు. చేతికి అందివచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

జాతీయ రహదారిపై 2 గంటల పాటు ఉద్రిక్తత

కిరణ్ మరణవార్త తెలియడంతో బంధువులు, గ్రామస్థులు, స్నేహితులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. బాధితుడికి న్యాయం చేయాలని, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో సుమారు రెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్ స్తంభించి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణకు దారితీసిన కచ్చితమైన కారణాలు ఏమిటి?, దాడి సమయంలో ఎంతమంది పాల్గొన్నారు, ఎవరెవరు కర్రలతో దాడి చేశారు? అనే కోణంలో విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. వినాయక విగ్రహం తెచ్చుకోవడానికి వెళ్లిన యువకుడు తిరిగి శవమై రావడంతో చౌదరిగూడ పరిసరాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Follow Us