హుజూరాబాద్ ఉపఎన్నిక ఈటల రాజేందర్ స్వార్థం వల్ల వచ్చిందంటూ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. హుజూరాబాద్ జిల్లా కావాలనో లేదా హుజూరాబాద్‌కు మెడికల్ కాలేజీ కావాలనో ఈటల రాజీనామా చేయలేదన్నారు. స్వలాభం కోసం ఈటల రాజీనామా చేసి.. ప్రజలపై ఉప ఎన్నికలు రుద్దారని ధ్వజమెత్తారు. వ్యక్తి లాభం ముఖ్యమా….వ్యవస్థ లాభం ముఖ్యమా? అని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ మండలం ధర్మరాజు పల్లి గ్రామంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కి మద్దతుగా మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించాలని కోరారు.
ఈటల రాజేందర్ ఎందుకు బీజేపీలో చేరారు…బీజేపీ ప్రజలకు ఏం చేసిందని ఆ పార్టీలో చేరారని మంత్రి హరీశ్ ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ ధర పెంచి ప్రజలకు బీజేపీ వాతలు పెడుతోందంటూ మండిపడ్డారు. నిన్న అక్కా చెళ్లెళ్లు బతుకమ్మల మధ్య సిలిండర్లు పెట్టి బీజేపీ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారని గుర్తుచేశారు. గ్యాస్ సిలిండర్ ధర వేయి రూపాయులు చేసిన బీజేపీ నిన్న మరో రూ.15 పెంచిందని విమర్శించారు. వారం వారం బీజేపీ గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలు పెంచుతోందని ధ్వజమెత్తారు. ధరలు పెంచే బీజేపీకి ఓటు వేద్దామా..? అంటూ ప్రజలను ప్రశ్నించారు.
ఈటల తనను చూసే పనులు జరుగుతున్నాయని చెప్పుకోవడం విడ్డూరమని మంత్రి హరీశ్ ఎద్దేవా చేశారు. మరి కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ ఎవరిని చూసి కేసీఆర్ గారు ఇచ్చారని ప్రశ్నించారు. రైతు బంధు అందుకున్న తొలి రైతు ధర్మరాజు పల్లి వాసేనని గుర్తుచేశారు. కరోనా సమయంలోనూ సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆపి మరీ రైతులకు రైతు బంధు ఇచ్చారని అన్నారు. అలాగే కరోనా టైంలోనూ రెండు వేల పెన్షన్ ఆపలేదని.. రేషన్ కార్డు దారులకు రూ.1500 బియ్యం, పప్పులు అందజేశామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల సాయం చేస్తున్నారా? అని మంత్రి హరీశ్ ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి ఉండాలా వద్దా..? ఈటల రాజేందర్ కళ్యాణ లక్ష్మి వద్దు అంటున్నారు.. మరి మీరేమంటారంటూ ప్రశ్నించారు. మేం గెలిస్తే విదేశాల నుంచి నల్ల ధనం తెచ్చి 15 లక్షల రూపాయలు మీ అక్కౌంట్లలో వేస్తామని బీజేపీ వాళ్లు చెప్పారు.. ఒక్క రూపాయి అయినా వేసారా.. ? అని విమర్శించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి వాతలు పెడుతోందని…సబ్సిడీల్లో కోతలు విధిస్తోందని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆరు సార్లు ఈటలను గెలిపించారని.. అయితే ఆయన నియోజకవర్గంలోని పేదల కోసం ఒక్క ఇళ్లుకట్టలేదని విమర్శించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుని ఒక్కసారి గెలిపిస్తే.. డుబుల్ బెడ్‌రూం ఇళ్లులు కట్టిస్తామని మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు.
Also Read..
Rakul Preet Singh: ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే ఇష్టం.. కొండపొలం నాకు పెద్ద సవాలు.. ఓబులమ్మ ముచ్చట్లు..
Covid patient: హృదయ విదారకం.. కళ్లెదుటే కన్నతల్లి మృతి.. కాపాడుకునేందుకు కూతురు, కొడుకు..